మీ పనేదో మీరు చూసుకుంటే మంచిది: ట్రంప్ పై కమల్ హాసన్ ఫైర్

  • అమెరికా అధ్యక్షుడిని ఉద్దేశించి కమల్ హాసన్ ఘాటు వ్యాఖ్యలు
  • భారత్ స్వతంత్ర, సార్వభౌమాధికారం కలిగిన దేశమని స్పష్టీకరణ
  • సుదూర తీరాల నుంచి వచ్చే ఆదేశాలను మేం పాటించబోమని వెల్లడి
  • మీ పని మీరు చూసుకుంటే మంచిదని అమెరికాకు సూచన
  • పరస్పర గౌరవంతోనే ప్రపంచ శాంతి సాధ్యమని వ్యాఖ్య
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఉద్దేశించి మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధినేత, ప్రముఖ నటుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ అంతర్గత విషయాల్లో విదేశాల జోక్యాన్ని పరోక్షంగా తప్పుబడుతూ ఆయన ఒక బహిరంగ లేఖ ద్వారా తన నిరసనను, అభిప్రాయాన్ని బలంగా వెల్లడించారు. తాము స్వతంత్ర దేశ పౌరులమని, విదేశాల ఆదేశాలకు తలొగ్గే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు.

"మిస్టర్ ప్రెసిడెంట్.. మేం (భారతీయులు) స్వతంత్ర, సార్వభౌమాధికారం కలిగిన దేశానికి చెందిన ప్రజలం. సుదూర తీరాల నుంచి వచ్చే ఆదేశాలను స్వీకరించే రోజులు ఎప్పుడో పోయాయి. మీ సామర్థ్యం మేరకు మీ పనేదో మీరు చూసుకుంటే మంచిది (Mind your own business)" అంటూ కమల్ హాసన్ అమెరికా అధ్యక్షుడికి ఘాటుగా సూచించారు. దేశాల మధ్య పరస్పర గౌరవం ఉన్నప్పుడే ప్రపంచంలో శాంతి నెలకొంటుందని ఆయన హితవు పలికారు. అది మాత్రమే శాశ్వత ప్రపంచ శాంతికి ఏకైక పునాది అని ఆయన పేర్కొన్నారు.

అయితే, చివరగా అమెరికా దేశానికి, అక్కడి ప్రజలకు శాంతి, సౌభాగ్యాలు కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. "ఒక గర్వించదగ్గ భారతీయ పౌరుడు" అంటూ ఈ లేఖను కమల్ హాసన్ ముగించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. భారత్ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించేలా ఎవరైనా వ్యవహరిస్తే సహించేది లేదని కమల్ హాసన్ తన లేఖ ద్వారా స్పష్టమైన సందేశాన్ని పంపారు.

రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు భారత్ కు 30 రోజుల పాటు అనుమతి ఇస్తున్నామని అమెరికా ప్రకటన చేసిన నేపథ్యంలో, కమల్ హాసన్ స్పందన ప్రాధాన్యత సంతరించుకుంది.


More Telugu News