రూ.50తో టిక్కెట్ కొంటే రూ.30 లక్షల లాటరీ తగిలింది.. విజేత ఎక్కడో తెలియక డప్పులతో చాటింపు
- పంజాబ్‌లోని బర్నాలాలో ఆసక్తికర సంఘటన
- బర్నాలా రైల్వే స్టేషన్ సమీపంలోని ఏజెంట్ వద్ద కొనుగోలు చేసిన టిక్కెట్‌కు లాటరీ
- టిక్కెట్‌పై పేరు, ఫోన్ నెంబర్ లేకపోవడంతో తెలియని విజేత వివరాలు
- గల్లీ గల్లీ తిరుగుతూ మైకులు, డప్పులతో చాటింపు
నెలవారీ లాటరీ నిర్వహించే ఒక సంస్థ ఫిబ్రవరి 26న విజేతలను ప్రకటించింది. బర్నాలా రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక ఏజెంట్ వద్ద కొనుగోలు చేసిన నెంబరుకు లాటరీ తగిలింది. కానీ ఆ టిక్కెట్‌పై కొనుగోలు చేసిన వారి పేరు, ఫోన్ నెంబర్ తదితర వివరాలు లేవు. కమీషన్ కింద ఏజెంటుకు రూ.1 లక్ష అందజేశారు. అయితే విజేతను ప్రకటించిన నెల రోజుల్లోగా ప్రైజ్ మనీ తీసుకోని పక్షంలో అది ప్రభుత్వ ఖజానాకు వెళుతుంది.
అందుకే, ఈ లాటరీ తగిలిన వ్యక్తి కోసం ఆ ఏజెంటు గల్లీ గల్లీ తిరుగుతూ మైకులు, డప్పు చప్పుల్లతో చాటింపు వేయిస్తున్నాడు. లాటరీ తగిలిన వ్యక్తి వస్తే ప్రైజ్ మనీ ఇవ్వడం కోసం ప్రాంగణాన్ని బెలూన్లతో అలంకరించారు. టిక్కెట్ కొనుగోలు చేసిన వ్యక్తి ఆచూకీ దొరకకపోవడం స్థానికంగా ఆసక్తిని రేపింది.