అధిష్ఠానం అనుమతిస్తే ఇంకో రెండు బడ్జెట్లు ప్రవేశపెడతా!: సిద్ధరామయ్య

  • అధిష్ఠానం నిర్ణయం మేరకే పదవిలో కొనసాగుతానని స్పష్టీకరణ
  • రాష్ట్రంలో ఇప్పటివరకు అత్యధికంగా 17 బడ్జెట్లు ప్రవేశపెట్టిన సిద్ధరామయ్య
  • ప్రధాని మోదీ వచ్చాకే ఎల్పీజీ ధరలు పెరిగాయని మండిపాటు
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ పదవీకాలం మరో రెండేళ్లు మిగిలి ఉన్న నేపథ్యంలో.. పార్టీ హైకమాండ్ అనుమతిస్తే మరో రెండు బడ్జెట్‌లను తానే ప్రవేశపెడతానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. పరోక్షంగా, పూర్తి టర్మ్ తానే సీఎంగా కొనసాగుతాననే కోణంలో వ్యాఖ్యానించారు. సీఎం పీఠం కోసం ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సిద్ధంగా ఉన్న నేపథ్యంలో సిద్ధరామయ్య వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. శనివారం వరుణ హోబ్లీలోని పిల్లహళ్లి హెలిప్యాడ్ వద్ద జిల్లా యంత్రాంగం నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా కొనసాగడం, బడ్జెట్ ప్రవేశపెట్టడంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఆసక్తికర సమాధానాలిచ్చారు.

రాష్ట్ర ప్రజలు తాను కొనసాగాలని కోరుకుంటున్నారని, అయితే అంతిమ నిర్ణయం మాత్రం హైకమాండ్‌దేనని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. "నాకు పూర్తి నమ్మకం ఉంది. అధిష్టానం తీసుకునే నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. బడ్జెట్‌ల విషయంలో రికార్డులు బద్దలు కొట్టడం ముఖ్యం కాదు, కానీ అవకాశం ఇస్తే చేయడం సాధ్యమే" అని ఆయన అన్నారు. తాను ఇప్పటివరకు 17 బడ్జెట్‌లను ప్రవేశపెట్టానని, రాష్ట్రంలో ఇదే అత్యధికమని గుర్తు చేశారు. మీడియా ప్రతినిధులు ఎన్ని రకాలుగా ప్రశ్నలు అడిగినా తన సమాధానం మారదని, హైకమాండ్ ఉండమంటే ఉంటానని, వద్దంటే తప్పుకుంటానని తేల్చిచెప్పారు.

ఈ సందర్భంగా ఎల్పీజీ సిలిండర్ ధరల పెరుగుదలపై స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి రాకముందు గ్యాస్ ధర ఎంత ఉందో అందరికీ తెలుసని, బీజేపీ వచ్చాకే ధరలు పెరిగాయని ఆరోపించారు. మీడియా ఈ విషయాలను రాయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అనంతరం దండిమారమ్మ, సిద్దప్పాజీ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన కుంభాభిషేక మహోత్సవంలో సీఎం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యతీంద్ర సిద్ధరామయ్య, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


More Telugu News