శాసనమండలికి వచ్చిన బొత్సను ఆత్మీయంగా పలకరించిన నారా లోకేశ్
- ఇటీవల అనారోగ్యం పాలైన బొత్స సత్యనారాయణ
- పూర్తి ఆరోగ్యంతో బొత్స సభకు రావడం సంతోషంగా ఉందన్న లోకేశ్
- లోకేశ్ కి ధన్యవాదాలు తెలిపిన బొత్స
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఈరోజు ఒక ఆసక్తికరమైన, ఆరోగ్యకరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఇటీవల వైసీపీ నేత, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్వల్ప అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందారు. అనారోగ్యం నుంచి కోలుకున్న ఆయన ఈరోజు సభకు హాజరయ్యారు.
బొత్స సభలోకి రాగానే మంత్రి నారా లోకేశ్ ఎంతో ఆత్మీయంగా స్పందిస్తూ, ‘బొత్స సత్యనారాయణ గారు నమస్కారం’ అంటూ పలకరించారు. తొలుత బొత్స గమనించకపోవడంతో, మండలి చైర్మన్ మోషేను రాజు జోక్యం చేసుకుని మంత్రి మిమ్మల్ని పలకరిస్తున్నారని తెలియజేశారు.
"గురువుగారు (బొత్స) చిన్న అనారోగ్య సమస్యతో బాధపడ్డారు. ఆయన మళ్ళీ పూర్తి ఆరోగ్యంతో సభకు రావడం చాలా సంతోషంగా ఉంది" అని లోకేశ్ అన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ కి బొత్స ధన్యవాదాలు తెలిపారు. రాజకీయంగా వైరిపక్షాలైనప్పటికీ, వ్యక్తిగత ఆరోగ్యం విషయంలో లోకేశ్ చూపిన ఈ గౌరవం సభలో అందరినీ ఆకట్టుకుంది.