Israel Defense Forces: హెలికాప్టర్ బొమ్మతో ఇజ్రాయెల్ ను బురిడీ కొట్టించిన ఇరాన్.. వీడియో ఇదిగో!

Israel Defense Forces Tricked by Iran Helicopter Decoy
  • 2డి బొమ్మపై ఇజ్రాయెల్ మిసైల్ దాడి!
  • ఇరాన్ హెలికాప్టర్ ను ధ్వంసం చేశామంటూ వీడియో షేర్ చేసిన ఐడీఎఫ్
  • వైరల్ గా మారిన వీడియోపై ఆన్ లైన్ వేదికల్లో చర్చ
పశ్చిమాసియాలో యుద్ధం క్షిపణులు, బాంబులతోనే కాదు.. మైండ్ గేమ్స్‌తో కూడా సాగుతోంది. తాజాగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) విడుదల చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఇరాన్‌ కు చెందిన ఒక యుద్ధ విమానాన్ని లేదా హెలికాప్టర్‌ను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ ప్రకటించగా, నెటిజన్లు మాత్రం అది వాస్తవం కాదని వాదిస్తున్నారు.

అసలు ఏం జరిగిందంటే..
ఇజ్రాయెల్ సైన్యం ఒక వీడియోను షేర్ చేసింది. అందులో ఒక హెలికాప్టర్ పార్క్ చేసి ఉండగా, ఇజ్రాయెల్ క్షిపణి వచ్చి దానిని నేరుగా ఢీకొట్టి ధ్వంసం చేసినట్లు కనిపిస్తోంది. ఈ వీడియోను షేర్ చేస్తూ ‘‘ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీశాం’’ అంటూ ఐడీఎఫ్ పేర్కొంది. అయితే, ఈ వీడియోను నిశితంగా పరిశీలించిన నెటిజన్లు, నిపుణులు ఇజ్రాయెల్‌ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. 

కారణాలు ఇవే..
ఆ హెలికాప్టర్ నేలపై గీసిన ఒక భారీ పెయింటింగ్ లాగా కనిపిస్తోందని నెటిజన్లు అంటున్నారు. ఎండలో ఉన్న ఏ వస్తువుకైనా నీడ ఉండాలి, కానీ ఆ హెలికాప్టర్‌కు నీడ లేకపోవడాన్ని చాలామంది ఎత్తిచూపుతున్నారు. అది కేవలం 2D పెయింటింగ్ అని వాదిస్తున్నారు. క్షిపణి తగిలినప్పుడు ఆ హెలికాప్టర్ ముక్కలు కావాల్సింది పోయి, నేలపై ఉన్న పెయింట్ చెదిరిపోయినట్లు కనిపిస్తోందని మరికొందరు విశ్లేషిస్తున్నారు.

ఇరాన్ తెలివైన ఎత్తుగడ..
శత్రువులను బురిడీ కొట్టించడానికి యుద్ధ సమయంలో ఇలాంటి ‘డెకాయ్స్’ (నకిలీ లక్ష్యాలు) వాడటం సాధారణమే. ఇరాన్ కూడా ఇజ్రాయెల్ ఖరీదైన క్షిపణులను వృథా చేయించడానికి, నేలపై హెలికాప్టర్ లాంటి పెయింటింగ్ వేసి ఉండొచ్చని, ఇజ్రాయెల్ దానిని నిజమైనదిగా నమ్మి బాంబులు వేసిందని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఈ విమర్శలపై ఇజ్రాయెల్ సైన్యం ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే, యుద్ధ విమానాలు మరియు క్షిపణి వ్యవస్థలు కేవలం విజువల్స్ మాత్రమే కాకుండా ‘థర్మల్ సిగ్నేచర్’ (వేడిని గుర్తించడం) ఆధారంగా కూడా పనిచేస్తాయని, కాబట్టి అది పెయింటింగ్ అయ్యే అవకాశం లేదని ఇజ్రాయెల్ మద్దతుదారులు వాదిస్తున్నారు.
Israel Defense Forces
Iran
Israel
IDF
Helicopter
Decoys
Military
Middle East Conflict
Iran Military
Israel Military

More Telugu News