: కుమార్తెను వేధిస్తున్న పోకిరిని చితక్కొట్టిన తండ్రి.. పూణేలో ఘటన.. వీడియో ఇదిగో!
- ఆన్ లైన్ వేదికల్లో 15 రోజులుగా విద్యార్థినికి వేధింపులు
- కుమార్తెతో పాటు కాలేజీకి వెళ్లి పోకిరిని నిలదీసిన తండ్రి
- పొగరుగా జవాబివ్వడంతో యువకుడికి దేహశుద్ధి చేసిన వైనం
కుమార్తెను వేధిస్తున్న ఓ యువకుడిని కాలేజ్ క్యాంపస్ లోనే నిలదీశాడు.. ఇదేం పనంటూ మందలించగా యువకుడు పొగరుగా జవాబిచ్చాడు. దీంతో ఆగ్రహం చెందిన ఆ తండ్రి సదరు పోకిరీని చితకబాదాడు. ‘ఆక్స్‌ఫర్డ్ ఆఫ్ ది ఈస్ట్’ గా పేరొందిన పూణే నగరంలోని ఎంఐటీ ఆర్ట్స్, డిజైన్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. పూణే లోని ఎంఐటీ యూనివర్సిటీలో చదువుతున్న ఓ యువతిని గత 15 రోజులుగా డి.వై.పాటిల్ కాలేజీకి చెందిన విద్యార్థి ఆన్‌లైన్ లో వేధిస్తున్నాడు. సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైన సందేశాలు పంపిస్తూ మానసిక క్షోభకు గురిచేశాడు. దీంతో భరించలేక ఆ యువతి తన తండ్రికి విషయం చెప్పింది.
నచ్చజెప్పబోతే.. రెచ్చగొట్టాడు
నచ్చజెప్పబోతే.. రెచ్చగొట్టాడు
కూతురిని వేధిస్తున్న వ్యక్తిని నిలదీయాలని ఆమె తండ్రి కాలేజీకి వచ్చారు. మొదట ఆ విద్యార్థికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే, సదరు పోకిరీ విద్యార్థి అహంకారంతో మాట్లాడాడు. దీంతో సహనం కోల్పోయిన తండ్రి, అందరూ చూస్తుండగానే ఆ యువకుడిని కిందపడేసి ఉతికి ఆరేశారు.
సోషల్ మీడియాలో చర్చ..
ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘‘ఒక తండ్రిగా తన బిడ్డను రక్షించుకోవడానికి ఆయన చేసింది సరైనదే.. ఇలాంటి వాళ్లకు పోలీసులకంటే ఇలాంటి ట్రీట్‌మెంట్ ఇస్తేనే బుద్ధి వస్తుంది’’ అని కొందరు నెటిజన్లు సమర్థిస్తున్నారు. ‘‘పోలీసులకు ఫిర్యాదు చేయాల్సింది. ఇలా కొట్టడం చట్టరీత్యా నేరం’’ అని మరికొందరు వాదిస్తున్నారు. ప్రస్తుతం స్థానిక పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.