ఇరాన్‌ విషయం పూర్తయ్యాక క్యూబా సంగతి చూస్తాం: ట్రంప్ హెచ్చరిక

  • అనుకున్న దానికంటే వేగంగా ఇరాన్‌పై దాడులు కొనసాగిస్తున్నామన్న ట్రంప్
  • ఇరాన్ నావిక దళాన్ని నాశనం చేశామని తెలిపిన ట్రంప్
  • ఇరాన్ అధికారులు కాళ్లబేరానికి వచ్చారన్న అమెరికా అధ్యక్షుడు
  • క్యూబా సంగతి చూస్తాం కానీ ఎప్పుడనేది చెప్పలేమని వ్యాఖ్య
మొదట ఇరాన్ విషయం తేల్చిన తర్వాత క్యూబాపై దృష్టి సారిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. 2025 మేజర్ లీగ్ సాకర్ ఛాంపియన్స్‌గా నిలిచిన ఇంటర్ మయామి జట్టుకు శ్వేతసౌధంలో ట్రంప్ ఘనంగా ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ఇరాన్ పని ముగించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

ఇజ్రాయెల్‌తో కలిసి అనుకున్న దానికంటే వేగంగానే తమ దళాలు ఇరాన్‌పై దాడులు కొనసాగిస్తున్నాయని అన్నారు. వరుస దాడుల వల్ల ఇరాన్ సైనిక సామర్థ్యాలు కూడా భారీగా క్షీణించాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్, అమెరికాకు ఉన్నట్లు ఇరాన్‌కు సమర్థవంత వైమానిక దళం లేదని అన్నారు. ఇప్పటికే ఇరాన్ నావికా దళాన్ని నాశనం చేశామని అన్నారు.

మూడు రోజుల్లో 24 ఇరాన్ నౌకలను తుడిచి పెట్టడంతో ఇరాన్ అధికారులు కాళ్ల బేరానికి వచ్చారని అన్నారు. అణు ఒప్పందంపై చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నట్లు వారు తమతో చెప్పారని వెల్లడించారు. వారి విజ్ఞప్తిని తోసిపుచ్చామని, ఇప్పటికే ఆలస్యమైందని వారికి స్పష్టం చేసినట్లు ట్రంప్ తెలిపారు. టెహ్రాన్ రాజకీయ భవిష్యత్తును పునర్నిర్మించడానికి ఇరాన్ దౌత్యవేత్తలు తమకు సహకరించాలని సూచించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో తమతో ఒప్పందం కోసం క్యూబా కూడా వేచిచూస్తోందని ట్రంప్ తెలిపారు. కానీ ఆ దేశ ప్రభుత్వం అమెరికా జాతీయ భద్రతకు, విదేశాంగ విధానానికి తీవ్రమైన ముప్పుగా మారిందని పేర్కొన్నారు. ఇరాన్ పని ముగిసిన తర్వాత క్యూబా సంగతి చూస్తామని అన్నారు. అయితే అది ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేమని వ్యాఖ్యానించారు. పశ్చిమాసియాలో తమ ఆపరేషన్ ముగిసిన తర్వాత అమెరికా విదేశాంగ విధాన ప్రాధాన్యతలలో పలు మార్పులు చోటు చేసుకుంటాయని అన్నారు.


More Telugu News