Abdul Majid Hakem Elahi: ఇరాన్ ఇప్పుడు రెండు యుద్ధాలు ఎదుర్కొంటోంది: భారత్ లో ఇరాన్ ఎంబసీ ప్రతినిధి ఇలాహీ

Abdul Majid Hakem Elahi Iran Facing Two Wars
  • భారత్, చైనాలు గ్లోబల్ పవర్స్ కాకుండా అమెరికా కుట్ర చేస్తుందన్న ఇరాన్ ఎంబసీ ప్రతినిధి ఇలాహీ
  • తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికే ప్రపంచ ఘర్షణలన్న ఆరోపణ
  • అమెరికా ఆపితే తాము కూడా ఘర్షణను ఆపుతామని వెల్లడి
  • సైనిక యుద్ధంతో పాటు ఫేక్ న్యూస్ యుద్ధాన్ని ఎదుర్కొంటున్నామని వ్యాఖ్య
ఇరాన్ ప్రస్తుతం రెండు యుద్ధాలను ఎదుర్కొంటోందంటూ ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయ ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహి (ఖమేనీ ప్రతినిధి) కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న వేళ ఆయన ఢిల్లీలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమ దేశం రెండు యుద్ధాలను ఎదుర్కొంటోందన్నారు. ఒకటి అమెరికా, ఇజ్రాయెల్‌తో సైనిక ఘర్షణ కాగా, రెండోది నకిలీ వార్తలతో జరుగుతున్న యుద్ధమని పేర్కొన్నారు. ఇరాన్ ప్రజలు పాలన మార్పు కోరుకుంటున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ ఫేక్ న్యూస్ యుద్ధం సైనిక ఘర్షణ కన్నా పెద్దదని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఇదే సందర్భంలో ఆయన సంచలన కామెంట్స్ చేశారు. భారత్‌తో పాటు చైనా అంతర్జాతీయంగా శక్తిమంతమైన దేశాలుగా ఎదగకుండా అడ్డుకోవడానికే అమెరికా తమ దేశంతో ఘర్షణ పడుతోందని ఆరోపించారు. భవిష్యత్తులో భారత్, చైనా, రష్యా, అమెరికా ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన దేశాలుగా ఉంటాయని అబ్దుల్ మజీద్ అన్నారు. అయితే, భారత్ లేదా చైనా తనతో సమానమైన శక్తులుగా మారడాన్ని అమెరికా సహించలేకపోతోందని, అందుకే యుద్ధాలను ప్రేరేపించి తన ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. ఈ యుద్ధాన్ని ప్రారంభించింది అమెరికా, ఇజ్రాయెల్ అని, తాము కేవలం ఆత్మరక్షణకే పరిమితమయ్యామని అబ్దుల్ మజీద్ స్పష్టం చేశారు. ‘దాడిని ప్రారంభించింది అమెరికానే కాబట్టి, దాన్ని ముగించాల్సిన బాధ్యత కూడా ఆ దేశానిదే. వారు దాడులు ఆపితే, మేం కూడా ఆపుతాం’ అని ఆయన తెలిపారు.
 
Abdul Majid Hakem Elahi
Iran
India
US relations
Israel
Fake news
China
Iran war
Iran embassy India
world power

More Telugu News