మోదీ ఇజ్రాయెల్ ను వీడిన 48 గంటల తర్వాత ఇరాన్‌పై దాడి... ఇజ్రాయెల్ రాయబారి ఏమన్నారంటే..?

  • మోదీ ఇజ్రాయెల్ నుంచి వెళ్లిపోయాక దాడికి అవకాశం వచ్చిందన్న రాయబారి
  • మోదీ పర్యటనలో దేశాభివృద్ధి గురించి మాత్రమే చర్చించినట్లు వెల్లడి
  • యుద్ధం గురించి ఆయనతో చర్చించలేదని స్పష్టీకరణ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన అనంతరం ఇరాన్‌పై దాడులు జరగడంపై సర్వత్రా చర్చ సాగుతోంది. ఫిబ్రవరి 25, 26 తేదీలలో మోదీ రెండు రోజుల పాటు పర్యటించారు. మోదీ పర్యటన ముగిసిన రెండు రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడుల గురించి మోదీకి తెలుసని ఇలా వివిధ రకాల ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ స్పందించారు.

ఇరాన్‌పై దాడికి, మోదీ పర్యటనకు సంబంధం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరాన్‌పై దాడి ఒక ఆపరేషనల్ అవకాశమని అన్నారు. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ నుంచి వెళ్లిపోయాక ఆ అవకాశం వచ్చిందని తెలిపారు. మోదీ ఇజ్రాయెల్ పర్యటనలో దేశాభివృద్ధి గురించి మాత్రమే చర్చించామని, యుద్ధం గురించి ఆయనతో చర్చించలేదని స్పష్టం చేశారు.

ఆ సమయానికి దాడులు చేస్తామనే విషయం మాకు కూడా తెలియదని అన్నారు. మోదీ వెళ్లిపోయాక ఇరాన్‌పై దాడి గురించి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇరాన్‌పై దాడులకు ఫిబ్రవరి 28న ఉదయం సెక్యూరిటీ కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఆ తర్వాతే దాడులు ప్రారంభమయ్యాయని అన్నారు. ఈ దాడులకు సంబంధించి చాలాకాలం ముందు నుంచి అమెరికాతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు. సరైన సమయం కోసం వేచి చూస్తున్నామని, అది ఇప్పుడు కుదిరిందని రూవెన్ అజర్ తెలిపారు.


More Telugu News