శ్రీలంక తీరానికి సమీపంలో ఇరాన్ యుద్ధనౌకను ముంచేసింది మేమే: అమెరికా ప్రకటన

  • ఇరాన్ యుద్ధనౌకను తమ సబ్‌మెరైన్ కూల్చేసిందని అమెరికా రక్షణ మంత్రి ప్రకటన
  • శ్రీలంక తీరంలో మునిగిపోయిన ఇరాన్ నౌక ఐరిస్ దేనా
  • సముద్రంలో 32 మందిని రక్షించిన శ్రీలంక నావికాదళం
  • నౌకలో మొత్తం 180 మంది సిబ్బంది ఉన్నట్లు విదేశాంగ మంత్రి వెల్లడి
  • ఘటనా స్థలిలో చమురు తెట్టుగుర్తింపు.. కొనసాగుతున్న సహాయక చర్యలు
శ్రీలంక తీరానికి సమీపంలో ఇరాన్ యుద్ధనౌకను ముంచేసింది తామేనని అమెరికా ప్రకటన చేసింది. తమ సబ్‌మెరైన్ దాడి కారణంగానే ఆ నౌక మునిగిపోయిందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వెల్లడించారు. తాము అంతర్జాతీయ జలాల్లోనే ఈ దాడికి పాల్పడ్డామని ఆయన స్పష్టం చేశారు. శ్రీలంక దక్షిణ తీరంలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకోగా.. అమెరికా ప్రకటనతో ఈ ఘటనపై స్పష్టత వచ్చింది.

శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హెరత్ పార్లమెంట్‌లో తెలిపిన వివరాల ప్రకారం.. మునిగిపోయిన నౌకను ఇరాన్‌కు చెందిన 'ఐరిస్ దేనా' (IRIS Dena)గా గుర్తించారు. ఇందులో దాదాపు 180 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. బుధవారం ఉదయం 6 నుంచి 7 గంటల ప్రాంతంలో ఈ నౌక నుంచి ప్రమాద సంకేతాలు (డిస్ట్రెస్ కాల్) అందడంతో శ్రీలంక నావికాదళం, వాయుసేన వెంటనే అప్రమత్తమయ్యాయి. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు 32 మందిని రక్షించి గాలేలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో కేవలం నీటిపై చమురు తెట్టు తేలుతూ కనిపిస్తోందని, నౌక పూర్తిగా మునిగిపోయినట్లు అధికారులు తెలిపారు.

శ్రీలంక భూభాగ జలాలకు ఆవల ఈ ఘటన జరిగినప్పటికీ... మానవతా దృక్పథంతో రక్షణ చర్యలు చేపట్టినట్లు లంక నేవీ ప్రతినిధి కమాండర్ బుద్ధిక సంపత్ తెలిపారు. ప్రస్తుతం ప్రాణాలను కాపాడటంపైనే తమ దృష్టి ఉందని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 18 నుంచి 25 వరకు బంగాళాఖాతంలో జరిగిన నావికా విన్యాసాల్లో ఈ నౌక పాల్గొన్నట్లు తెలుస్తోంది. సముద్రంలో కొన్ని మృతదేహాలను గుర్తించామని, గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.


More Telugu News