Chadhalavada Srinivasa Rao: కలప దుంగలో శ్రీవారి పాదాల ఆకృతి... సినీ నిర్మాత చదలవాడ ఎస్టేట్‌లో అద్భుతం!

Chadhalavada Srinivasa Rao Sri Venkateswaras feet appear in timber log
  • ఏషియన్ టింబర్ ఎస్టేట్స్‌లో కలప దుంగను కట్ చేస్తుండగా అద్భుతం
  • దుంగ రెండు ముక్కలపైనా స్పష్టంగా కనిపించిన శ్రీవారి పాదాల ఆకృతి
  • విషయం తెలిసి హుటాహుటిన చేరుకుని సాష్టాంగ నమస్కారం చేసిన చదలవాడ సోదరులు
  • అవి తమ ఇలవేల్పు పవిత్ర చరణాలేనని.. నిత్య పూజలు చేస్తామని వెల్లడి
ప్రముఖ సినీ నిర్మాత, ఏషియన్ టింబర్ ఎస్టేట్స్ అధినేత చదలవాడ శ్రీనివాసరావుకు సంబంధించి ఒక విశేష సంఘటన చోటుచేసుకుంది. ఇటీవల చెన్నైలో దివంగత ఎన్టీఆర్ నివాసాన్ని కొనుగోలు చేసి మ్యూజియంగా మారుస్తున్న చదలవాడకు, తాజాగా హైదరాబాదు, కొల్లూరులోని తన టింబర్ ఎస్టేట్‌లో అత్యంత ఆసక్తికర అనుభవం ఎదురైంది. 

ఎప్పటిలాగే గత శనివారం వారి టింబర్ ఎస్టేట్‌లో సిబ్బంది కలప దుంగలను కటింగ్ మిషన్‌పై ఉంచి పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక దుంగను కట్ చేయగా.. ఆ రెండు చెక్క ముక్కలపైనా మనిషి పాదాలను పోలిన ఆకృతి స్పష్టంగా కనిపించింది. ఈ దృశ్యాన్ని చూసిన కార్మికులు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని తమ యజమాని చదలవాడ శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లారు.

దాంతో, చదలవాడ శ్రీనివాసరావు, ఆయన సోదరుడు తిరుపతిరావు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. దుంగపై ఉన్న పాదాల ఆకృతులను పరిశీలించి, అవి తమ ఇలవేల్పు అయిన తిరుమల శ్రీవారి పవిత్ర చరణాలేనని భావించి భక్తిపారవశ్యంతో సాష్టాంగ నమస్కారం చేశారు. "మా ఇలవేల్పు ఆ వెంకటేశుడే తన మహిమాన్విత చరణాలతో మా ఇంటిని పవిత్రం చేశాడు. ఇది మా పూర్వజన్మ సుకృతం. ఆ చరణాలను ఇక్కడే ఉంచి నిత్య పూజలతో ఆరాధిస్తాం" అని శ్రీనివాసరావు తెలిపారు.

కాగా, తెనాలికి చెందిన చదలవాడ సోదరుల పేర్లు వెంకటేశ్వరరావు, తిరుపతిరావు, శ్రీనివాసరావు కావడం, శ్రీనివాసరావు భార్య పేరు పద్మావతి కావడం యాధృచ్ఛికమే అయినా.. తాజా ఘటనతో తమకు కలియుగ దైవం వెంకటేశ్వరుడితో ఉన్న అనుబంధం మరింత బలపడిందని వారు భావిస్తున్నారు.

చదలవాడ శ్రీనివాసరావు నిర్మాత మాత్రమే కాదు... ఆయనకు భారీ స్థాయిలో కలప వ్యాపారం కూడా ఉంది.
Chadhalavada Srinivasa Rao
NTR
Tirumala
Lord Venkateswara
Timber estate
Tenali
Padmavathi
Miracle

More Telugu News