Balka Suman: ఆదిలాబాద్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన బాల్క సుమన్

Balka Suman Released on Bail from Adilabad Jail
  • క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నమోదైన కేసులో ఊరట
  • రెండు వేర్వేరు కేసుల్లోనూ బెయిల్ మంజూరు చేసిన కోర్టులు
  • సుమన్‌తో పాటు ఇతర బీఆర్ఎస్ నేతలకు కూడా బెయిల్
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నమోదైన కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి ఆదిలాబాద్ జైలులో రిమాండ్‌లో ఉన్న ఆయన, ఇవాళ‌ బెయిల్‌పై విడుదలయ్యారు. ఆయనతో పాటు ఇదే కేసులో అరెస్టయిన ఇతర బీఆర్ఎస్ నాయకులు కూడా జైలు నుంచి బయటకు వచ్చారు.

క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల నాటి ఘటనలకు సంబంధించి బాల్క సుమన్‌పై రెండు కేసులు నమోదయ్యాయి. ఓ కేసులో జిల్లా సెషన్స్ కోర్టు సోమవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే, చెన్నూర్ కోర్టులో మరో కేసు పెండింగ్‌లో ఉండటంతో ఆయన విడుదల ఆగిపోయింది. ఈ రెండో కేసుకు సంబంధించిన పీటీ వారెంట్ పిటిషన్‌పై విచారణను కోర్టు ఈ నెల 5వ తేదీకి వాయిదా వేసింది. దీంతో 5వ తేదీ తర్వాతే ఆయన విడుదల అవుతారని అందరూ భావించారు.

ఈ క్రమంలో బాల్క సుమన్ తరఫు న్యాయవాదులు నిన్న‌ చెన్నూర్ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. పీటీ వారెంట్‌పై విచారణను వెంటనే చేపట్టాలని కోరడంతో కోర్టు అంగీకరించి విచారణ జరిపింది. న్యాయవాదుల వాదనలు విన్న అనంతరం, ఈ కేసులోనూ బాల్క సుమన్‌కు బెయిల్ మంజూరు చేసింది. రెండు కేసుల్లోనూ బెయిల్ రావడంతో ఆయన విడుదలకు మార్గం సుగమమైంది. దీంతో ఆయన ఆదిలాబాద్ జైలు నుంచి విడుదలయ్యారు.
Balka Suman
BRS
BRS party
Kyathanapalli Municipal Elections
Mancherial district
Adilabad jail
Telangana politics
Bail
Chennur court

More Telugu News