Mahesh Babu: దారితప్పిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్... బెట్టింగ్ యాప్ కేసులో బుక్కయ్యాడు!

Mahesh Babu Arrested in Betting App Case in Nellore
  • నెల్లూరు కేంద్రంగా అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ రాకెట్ బట్టబయలు
  • R777 యాప్ ద్వారా దందా.. ప్రధాన సూత్రధారులు మహేశ్ బాబు, హరికృష్ణ అరెస్ట్
  • రూ.53 లక్షలు మోసపోయానంటూ బాధితుడి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన వ్యవహారం
నెల్లూరు నగరంలో అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలు సాగిస్తున్న భారీ క్రికెట్ బెట్టింగ్ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. ఆర్ 777 అనే యాప్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న ప్రధాన సూత్రధారులు మహేశ్ బాబు, పి. హరికృష్ణను బాలాజీ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తులో భాగంగా నిందితులకు చెందిన పలు బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.1.64 కోట్లను అధికారులు ఫ్రీజ్ చేశారు. 

నెల్లూరు ఏఎస్పీ దీక్ష తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు ఎన్టీఆర్ నగర్ కు చెందిన ఓ వ్యాపారికి బుచ్చికి చెందిన కె వేణుగోపాల్ పరిచయమై ఆన్ లైన్ యాప్ లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించాడు. దీంతో అతను రూ.53 లక్షలు డిపాజిట్ చేశాడు. లాభాలు రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి వ్యాపారి బాలాజీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  

విచారణలో వేణుగోపాల్, వెంకట రమణ, మహేశ్ బాబు, మణికుమార్ మరికొందరు కలిసి రాథే ఎక్సేంజ్ యాప్ (ఆర్ 777) ద్వారా క్రికెట్ బెట్టింగ్ ఆడిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో ఇప్పటికే వేణు, వెంకట రమణలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని, బ్యాంకుల్లోని నగదు సీజ్ చేశారు. కేసులో పరారీలో ఉన్న మణికుమార్, మహేశ్ బాబుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వారు బెంగళూరులో ఉంటున్న బుచ్చికి చెందిన మహేశ్ బాబుతో కలిసి బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. దీంతో పోలీసులు బెంగళూరులో మహేశ్ బాబు, అతని సహచరుడైన కందుకూరు ప్రాంతానికి చెందిన హరికృష్ణను అరెస్టు చేశారు. 

ఈ దందా నిర్వహణ కోసం గతంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేసిన మహేశ్ బాబు దుబాయ్, శ్రీలంక దేశాల్లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. దుబాయ్‌లోని నిర్వాహకుల నుంచి 30 శాతం వాటాపై యాప్‌ను తీసుకొని, స్థానికంగా మరికొందరికి 15 శాతం వాటా ఇస్తూ బెట్టింగ్ నెట్‌వర్క్‌ ను విస్తరించాడు. నిందితుల నుంచి పోలీసులు రూ.34.65 లక్షల నగదు, 13 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, మనీ కౌంటింగ్ మెషీన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు కె. మహేశ్ కుమార్, కె. మణి కుమార్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
 
Mahesh Babu
Cricket betting racket
Online betting app
R777 app
Nellore
Cyber crime
Betting fraud
Software engineer
Sri Lanka
Dubai

More Telugu News