Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మెక్సికోలో చరిత్ర సృష్టించిన షకీరా... వీడియో ఇదిగో!

Shakira Creates History in Mexico City Concert
Advertisement
  • మెక్సికో సిటీ జోకాలలో షకీరా లైవ్ షోకి 4 లక్షల మంది హాజరు
  • ఆ ప్రాంతంలో ఇదే అత్యధిక జనసందోహం అని వెల్లడి
  • మే 2న రియోలోని కోపకబానా బీచ్‌లో మరో భారీ కాన్సర్ట్
  • అత్యధిక వసూళ్లు రాబట్టిన హిస్పానిక్ టూర్‌గా షకీరా వరల్డ్ టూర్ రికార్డు
  • రాక్ అండ్ రోల్ హాల్ ఆఫ్ ఫేమ్ 2026 రేసులో చోటు దక్కించుకున్న సింగర్
Advertisement
ప్రముఖ పాప్ గాయని షకీరా మెక్సికోలో సరికొత్త సంచలనం సృష్టించింది. మెక్సికో సిటీలోని ఐకానిక్ జోకాల స్క్వేర్ వేదికగా వారాంతంలో ఆమె నిర్వహించిన లైవ్ పర్ఫార్మెన్స్‌కు జనం పోటెత్తారు. ఏకంగా 4 లక్షల మందికి పైగా అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జోకాల స్క్వేర్ చరిత్రలోనే ఇంతటి భారీ జనసందోహం హాజరవడం ఇదే తొలిసారి అని గణాంకాలు చెబుతున్నాయి. ఉచితంగా నిర్వహించిన ఈ ఈవెంట్ కోసం దేశం నలుమూలల నుంచి అభిమానులు తరలిరావడంతో మెక్సికో సిటీ మొత్తం పండుగ వాతావరణాన్ని తలపించింది.

'ఫిమేల్ ఫస్ట్ యూకే' కథనం ప్రకారం.. రద్దీని తట్టుకునేందుకు, అందరికీ ఈవెంట్ కనిపించేలా సమీపంలోని అలమెడా సెంట్రల్, మాన్యుమెంట్ టు ది రివల్యూషన్ ప్రాంతాల్లో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఈ షోలో కొలంబియన్ ఆర్టిస్ట్ బీలేతో కలిసి షకీరా వేదిక పంచుకుంది. మే 4న విడుదల కానున్న తమ కొత్త పాట 'ఆల్గో టు'ను ఈ సందర్భంగా ప్రదర్శించింది. షకీరా తన సూపర్ హిట్ సాంగ్స్ అయిన హిప్స్ డోంట్ లై, వాకా వాకా (దిస్ టైమ్ ఫర్ ఆఫ్రికా), డోంట్ బాదర్ వంటి పాటలతో అభిమానులను ఉర్రూతలూగించింది.

ఈ విజయంతో రెట్టింపు ఉత్సాహంతో ఉన్న షకీరా.. మే 2న రియో డి జనీరోలోని కోపకబానా బీచ్‌లో జరిగే మరో భారీ ఉచిత కాన్సర్ట్‌కు సిద్ధమవుతోంది. మరోవైపు, షకీరా నిర్వహించిన 'లాస్ ముజెరెస్ యా నో ల్లోరన్' వరల్డ్ టూర్ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన హిస్పానిక్ టూర్‌గా నిలిచినట్లు బిల్‌బోర్డ్ ఇటీవల ధృవీకరించింది. అమెరికా, లాటిన్ అమెరికా వ్యాప్తంగా 82 షోల ద్వారా 421.6 మిలియన్ డాలర్ల వసూళ్లతో పాటు 33 లక్షల మందిని ఆకర్షించి రికార్డు సృష్టించింది. అంతేకాకుండా, ప్రతిష్ఠాత్మక రాక్ అండ్ రోల్ హాల్ ఆఫ్ ఫేమ్-2026 నామినేషన్లలో షకీరా చోటు దక్కించుకోవడం మరో విశేషం.
Advertisement
Advertisement
Shakira
Shakira concert
Mexico City
Zocalo Square
Algo Tu
Las Mujeres Ya No Lloran
Rock and Roll Hall of Fame
Colombian artist Bele
Rio de Janeiro concert

More Telugu News