Salman Agha: పాక్ కెప్టెన్ సల్మాన్ అఘాపై రషీద్ లతీఫ్ ఘాటు వ్యాఖ్యలు
- అక్రమ్, అక్తర్ లను ఇచ్చినా సల్మాన్ అఘా మ్యాచ్ కోల్పోయేలా చేయగలడన్న రషీద్
- అనవసర ప్రయోగాలు చేయడం జట్టు కొంప ముంచిందని విమర్శ
- కోచ్ మైక్ హెసన్ నిర్వహణ తీరు దారుణంగా ఉందని వ్యాఖ్య
టీ20 ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ అవమానకరంగా నిష్క్రమించడంపై ఆ దేశ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో నెట్ రన్ రేట్ సాధించడంలో విఫలం కావడంతో... సెమీస్ కు వెళ్లకుండా పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాపై లతీఫ్ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. "సల్మాన్ ఆఘాకు వసీం అక్రమ్, షోయబ్ అక్తర్ వంటి దిగ్గజాలను ఇచ్చినా, తన తెలివితక్కువతనంతో మ్యాచ్‌ను కోల్పోయేలా చేయగలడు" అంటూ ఎద్దేవా చేశాడు.
సెమీస్‌కు చేరాలంటే లంకను 147 పరుగులకే కట్టడి చేయాల్సి ఉండగా, వ్యూహాత్మక లోపాల వల్ల బౌలర్లు ఏకంగా 207 పరుగులు సమర్పించుకున్నారని రషీద్ లతీఫ్ విమర్శించాడు. నసీమ్ షా వంటి కీలక బౌలర్లను డెత్ ఓవర్లలో ఉపయోగించకపోవడం, బ్యాటింగ్ ఆర్డర్‌లో అనవసర ప్రయోగాలు చేయడం జట్టు కొంపముంచిందని లతీఫ్ విమర్శించాడు. హెడ్ కోచ్ మైక్ హెసన్ వైఫల్యాన్ని కూడా ఎత్తిచూపుతూ, ప్రస్తుత జట్టు నిర్వహణ తీరు దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశాడు.