KP Unnikrishnan: కేంద్ర మాజీ మంత్రి ఉన్నికృష్ణన్ కన్నుమూత.. ఒకే నియోజకవర్గం నుంచి వరుసగా ఆరు సార్లు గెలిచిన ఘనత

Unnikrishnan Former Union Minister Passes Away
  • 89 ఏళ్ల వయసులో కన్నుమూసిన ఉన్నికృష్ణన్
  • వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో బాధపడిన కేంద్ర మాజీ మంత్రి
  • కోజికోడ్ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

భారత రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి కేపీ ఉన్నికృష్ణన్ (89) కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, కేరళలోని కోజికోడ్ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. 


1936లో స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబంలో జన్మించిన ఉన్నికృష్ణన్, విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి వచ్చి అప్రతిహత విజయాలను అందుకున్నారు. కేరళ రాజకీయ చరిత్రలో వటకర లోక్‌సభ నియోజకవర్గం నుండి 1971 నుండి 1996 వరకు వరుసగా ఆరుసార్లు ఎంపీగా ఎన్నికై రికార్డు సృష్టించారు. ఆయన మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సహా పలువురు జాతీయ స్థాయి నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.


ఉన్నికృష్ణన్ పేరు వినగానే భారతీయులకు గుర్తొచ్చేది 1990 నాటి గల్ఫ్ యుద్ధ కాలపు సాహసోపేత చర్య. అప్పట్లో వీపీ సింగ్ ప్రభుత్వంలో ఉపరితల రవాణా, కమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా ఉన్న ఆయన, కువైట్‌లో చిక్కుకుపోయిన లక్షన్నర మంది భారతీయులను రక్షించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రాణాలకు తెగించి, అప్పటి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ఉన్న అత్యంత రహస్య ప్రాంతానికి వెళ్లి, ఆయనతో చర్చలు జరిపి భారతీయుల తరలింపును సుసాధ్యం చేశారు. 


రాజకీయంగా తొలినాళ్లలో ఇందిరా గాంధీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్నప్పటికీ, ఎమర్జెన్సీ తర్వాత సంజయ్ గాంధీతో విభేదించి కాంగ్రెస్ నుండి బయటకు వచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ (S) పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించి, 1995లో తిరిగి మాతృసంస్థ కాంగ్రెస్‌లో చేరారు. కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా, పార్లమెంటరీ కమిటీల్లో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయనకు భార్య అమృత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

KP Unnikrishnan
Former Union Minister
Congress Leader
Kerala Politics
Vatakara Constituency
Gulf War
Saddam Hussein
Indian Evacuation
VP Singh Government
Emergency Period

More Telugu News