Shahid Afridi: అతడికి తుది జట్టులో చోటే ఎక్కువ... అలాంటిది కెప్టెన్సీ కూడానా?: షాహిద్ అఫ్రిది

Shahid Afridi Criticizes Shadab Khans Performance and Captaincy Potential
  • సూపర్-8 దశలోనే టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన పాకిస్థాన్
  • ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ ప్రదర్శనపై షాహిద్ అఫ్రిది తీవ్ర విమర్శలు
  • కోచ్ మైక్ హెసన్ వల్లే షాదాబ్‌కు అవకాశాలు వస్తున్నాయని ఆరోపణ
  • పాక్ తదుపరి కెప్టెన్‌గా ఫఖర్ జమాన్ సరైనోడన్న అఫ్రిది
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు సూపర్-8 దశలోనే ఇంటిబాట పట్టడంతో ఆ జట్టు నాయకత్వంపై తీవ్ర చర్చ మొదలైంది. వరుసగా నాలుగోసారి ఐసీసీ ఈవెంట్లలో సెమీఫైనల్ చేరడంలో పాక్ విఫలమవడంతో, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది జట్టు కూర్పుపై, ముఖ్యంగా ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ప్రస్తుత పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా నేతృత్వంలో జట్టు ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది. దీంతో కెప్టెన్సీ మార్పు ఖాయమని వార్తలు వస్తున్న నేపథ్యంలో షాదాబ్ ఖాన్, షహీన్ అఫ్రిది పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దీనిపై సమా టీవీతో మాట్లాడిన షాహిద్ అఫ్రిది.. షాదాబ్ ఖాన్ పేరును ప్రస్తావించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశాడు. "షాదాబ్ ప్రదర్శన చూస్తుంటే అతనికి అసలు తుది జట్టులో చోటు ఇవ్వడమే ఎక్కువ.. అలాంటిది కెప్టెన్సీ ఎలా ఇస్తారు?" అని ప్రశ్నించారు. ఈ టోర్నీలో 7 మ్యాచ్‌లు ఆడిన షాదాబ్ కేవలం 118 పరుగులు చేసి, 5 వికెట్లు మాత్రమే తీయడాన్ని ఎత్తిచూపాడు.

ప్రధాన కోచ్ మైక్ హెసన్‌తో ఉన్న సాన్నిహిత్యం వల్లే షాదాబ్ జట్టులో కొనసాగుతున్నాడని అఫ్రిది ఆరోపించారు. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుకు హెసన్ కోచ్‌గా ఉన్నప్పటి నుంచి వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉందని, అందుకే షాదాబ్‌కు హెసన్ వరుస అవకాశాలు ఇస్తున్నారని విమర్శించారు. ఇటీవల ప్రదర్శన చూస్తే షాదాబ్ అసలు తుది జట్టుకు ఎంపిక చేయడానికి కూడా కూడా అనర్హుడని తేల్చిచెప్పాడు.

మరోవైపు ప్రస్తుత కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా కూడా ఈ టోర్నీలో దారుణంగా విఫలమయ్యాడు. ఏడు ఇన్నింగ్స్‌లలో కేవలం 10 సగటుతో 60 పరుగులు మాత్రమే చేశాడు. గత ఏడాది కాలంలో పాకిస్థాన్ జట్టుకు ఇతను నాలుగో కెప్టెన్ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో జట్టుకు దూకుడుగా నిర్ణయాలు తీసుకునే నాయకుడు కావాలని, ప్రస్తుత పరిస్థితుల్లో ఓపెనర్ ఫఖర్ జమాన్ ఆ బాధ్యతలకు సరిపోతాడని అఫ్రిది అభిప్రాయపడ్డాడు. శ్రీలంకతో జరిగిన చివరి సూపర్-8 మ్యాచ్‌లో పాక్ పోరాడినప్పటికీ, సెమీస్ అవకాశాలను దక్కించుకోలేకపోయింది. దీంతో పాక్ క్రికెట్ బోర్డు త్వరలోనే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
Shahid Afridi
Shadab Khan
Pakistan Cricket
T20 World Cup
Salman Ali Agha
Fakhar Zaman
Mike Hesson
Pakistan Super League
PSL
Cricket Team Selection

More Telugu News