Tirumala Temple: రేపు తిరుమల ఆలయం మూసివేత
- చంద్రగ్రహణం కారణంగా తిరుమల ఆలయం మూసివేత
- రేపు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు మూసివేత
- అన్ని రకాల దర్శనాలను రద్దు చేసిన అధికారులు
చంద్రగ్రహణం కారణంగా రేపు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ తలుపులను మూసివేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. గ్రహణ ప్రభావం కారణంగా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఆలయాన్ని పూర్తిగా మూసివేస్తారు. ఈ నేపథ్యంలో రేపు జరగాల్సిన వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు మరియు ప్రత్యేక ప్రవేశ దర్శనాలను అధికారులు పూర్తిగా రద్దు చేశారు. ఈరోజు రాత్రి వరకు మాత్రమే భక్తులను క్యూలైన్లలోకి అనుమతించనున్నారు. అలాగే తిరుపతిలో జారీ చేసే రేపటి కోటా సర్వదర్శనం టోకెన్లను కూడా రద్దు చేస్తున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది.
మరోవైపు, తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి, భక్తులు వెలుపల ఉన్న క్యూలైన్ల వరకు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనం లభించడానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజే 83,122 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 30,054 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం 4.49 కోట్ల రూపాయలు. గ్రహణం వీడిన అనంతరం ఆలయ శుద్ధి, ఇతర సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించి, రాత్రి 7.30 గంటల తర్వాతే భక్తులను తిరిగి దర్శనానికి అనుమతిస్తారు.