భారత్ సెమీస్ చేరడంపై అమీర్ అక్కసు... ఆ ఔట్ వల్లే గట్టెక్కారంటూ వ్యాఖ్య

  • భారత్ సెమీస్ చేరదన్న మొహమ్మద్ అమీర్ జోస్యం ఫెయిల్
  • వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో హెట్మెయర్ ఔట్ వివాదాస్పదమని అమీర్ వ్యాఖ్య
  • సంజూ శాంసన్ కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడని ప్రశంస
  • ఫీల్డింగ్, బౌలింగ్‌లో భారత్ బలహీనంగా ఉందని విమర్శ
  • ఒక్క బుమ్రాపైనే టీమిండియా ఆధారపడిందని అమీర్ విశ్లేషణ
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీఫైనల్ కూడా చేరదని జోస్యం చెప్పి అడ్డంగా బుక్కయిన పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ అమీర్, ఇప్పుడు కొత్త వాదనతో ముందుకొచ్చాడు. భారత్ సెమీస్ చేరడంతో సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్‌కు గురైన అమీర్.. వెస్టిండీస్‌పై భారత్ గెలుపు వెనుక ఒక వివాదాస్పద అంపైరింగ్ నిర్ణయం ఉందని వ్యాఖ్యానించి మరోసారి వార్తల్లో నిలిచాడు. ఆ ఒక్క ఔట్ లేకపోయి ఉంటే, భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించేదని అతను అభిప్రాయపడ్డాడు.

వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో 12వ ఓవర్ వేసిన జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో షిమ్రాన్ హెట్మెయర్ భారీ షాట్‌కు ప్రయత్నించి వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు క్యాచ్ ఇచ్చాడు. అంపైర్ క్రిస్ గఫానీ వెంటనే ఔటిచ్చినా, హెట్మెయర్ రివ్యూ కోరాడు. రీప్లేలో బంతి బ్యాట్‌ను తాకినట్టు స్పష్టంగా కనిపించినప్పటికీ, హెట్మెయర్‌తో పాటు విండీస్ డగౌట్ కూడా ఆ నిర్ణయంతో సంతృప్తి చెందలేదు. ఈ ఘటనపై ఒక పాకిస్థానీ టీవీ షోలో అమీర్ మాట్లాడుతూ... "నాకు తెలిసి హెట్మెయర్ ఔట్ కాదు. అది ఒక వివాదాస్పద నిర్ణయం. ఒకవేళ అతను మరికొంత సేపు క్రీజులో ఉండి, స్కోరు 220-230కి చేరి ఉంటే భారత్ ఓడిపోయేది" అని అన్నాడు.

అదే సమయంలో ఈ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన సంజూ శాంసన్‌పై (50 బంతుల్లో 97 పరుగులు) అమీర్ ప్రశంసలు కురిపించాడు. "సంజూ శాంసన్ తన జీవితంలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. ఇలాంటి డూ ఆర్ డై మ్యాచ్‌లో ఇంత గొప్పగా ఆడటం విశేషం" అని కొనియాడాడు.

అయితే, మొత్తం మీద చూస్తే టీమిండియా మంచి క్రికెట్ ఆడటం లేదని అమీర్ విమర్శించాడు. "భారత ఫీల్డింగ్‌ను చూడండి. మూడు నాలుగు క్యాచ్‌లు నేలపాలు చేశారు. ఫీల్డ్‌లో తడబడ్డారు. బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా మినహా మిగతా బౌలర్లందరూ భారీగా పరుగులు ఇస్తున్నారు. భారత్ కేవలం ఒక్క బౌలర్ మీదే ఆధారపడి ఆడుతోంది. నా అంచనా తప్పని మీరు అంటున్నారేమో గానీ, వాస్తవాలు ఇవే" అని అమీర్ తన విశ్లేషణను ముగించాడు.

Mohammad Amir
India
T20 World Cup
Shimron Hetmyer
Sanju Samson
Jasprit Bumrah
West Indies
Cricket
Umpire decision
Pakistan

More Telugu News