మహేశ్ బాబు ‘వారణాసి’కి సంబంధించిన కీలక విషయాన్ని లీక్ చేసిన ప్రియాంక చోప్రా

  • 'వారణాసి'లో కీలకపాత్ర పోషిస్తున్న ప్రియాంక చోప్రా
  • త్వరలో అంటార్కిటికాలో కలుద్దామంటూ మహేశ్ కు ట్వీట్
  • 'వారణాసి' తదుపరి షెడ్యూల్ అంటార్కిటికాలో అనే విషయం లీక్

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది బ్లఫ్’ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ప్రియాంక నటనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ సినిమాపై దర్శక దిగ్గజం రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. రాజమౌళి తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ... ప్రియాంక ఒకే సమయంలో సున్నితత్వాన్ని, తీవ్రమైన శక్తిని ప్రదర్శించగల అరుదైన నటి అని, ‘ది బ్లఫ్’లో ఆమె చేసిన యాక్షన్ స్టంట్స్ అద్భుతమని కొనియాడారు. అటు మహేశ్ బాబు సైతం ఈ చిత్రాన్ని అద్భుతమైన యాక్షన్ ఎమోషన్స్ ఉన్న చిత్రంగా అభివర్ణిస్తూ, ప్రియాంక నటన సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని అభినందించారు.


అయితే, ఈ ట్వీట్‌కు ప్రియాంక చోప్రా ఇచ్చిన రిప్లై అసలైన సంచలనానికి తెరలేపింది. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు నటిస్తున్న ప్రతిష్ఠాత్మక అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’లో ప్రియాంక ‘మందాకిని’ అనే కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మహేశ్ అభినందనలకు కృతజ్ఞతలు చెబుతూ... "థాంక్యూ మై ఫ్రెండ్.. త్వరలోనే అంటార్కిటికాలో కలుద్దాం" అంటూ ఆమె బదులిచ్చింది. ఈ కామెంట్‌తో 'వారణాసి' తదుపరి షెడ్యూల్ మంచు ఖండమైన అంటార్కిటికాలో జరగబోతోందని ఆమె అధికారికంగా ధృవీకరించినట్లయింది. అంటార్కిటికాలో షూటింగ్ జరుపుకోనున్న తొలి భారతీయ చిత్రంగా ‘వారణాసి’ చరిత్ర సృష్టించబోతోంది. అత్యంత కఠినమైన వాతావరణంలో జక్కన్న ప్లాన్ చేస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ కోసం ఫ్యాన్స్ ఇప్పుడే లెక్కలు వేసుకుంటున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


More Telugu News