సొంతూరులో విజయ్ - రష్మిక పూజలు.. భారీగా తరలి వచ్చిన అభిమానులు

  • నాగర్‌కర్నూల్ జిల్లా తుమ్మెన్ పేటలో విజయ్ - రష్మిక 
  • సత్యనారాయణ వ్రతం చేస్తున్న నవ దంపతులు
  • హాజరైన రాజకీయ ప్రముఖులు

టాలీవుడ్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నల రాకతో నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలం తుమ్మెన్ పేట గ్రామం పులకించిపోతోంది. విజయ్ స్వగ్రామంలో ఈ నూతన దంపతులు డప్పు వాయిద్యాలు, మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా తులసిమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెళ్లి తర్వాతి ఆచారాల్లో భాగంగా వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య వీరు సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమంలో ఆసీనులయ్యారు. ఈ వేడుకను కళ్లారా చూసేందుకు అచ్చంపేట నియోజకవర్గంలోని వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నేతలతో పాటు గ్రామానికి చెందిన సుమారు 400 మంది అతిథులు హాజరయ్యారు. విజయ్-రష్మికల రాకతో తుమ్మెన్ పేటలో పండుగ వాతావరణం నెలకొంది. తమ అభిమాన నటులను చూడటానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.


అయితే, ఈ స్టార్ కపుల్ భద్రత దృష్ట్యా వారి నివాసం వద్ద కట్టుదిట్టమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. కేవలం ముందస్తు పాసులు ఉన్న వారిని మాత్రమే ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతిస్తున్నారు. అచ్చంపేట డీఎస్పీ పల్లె శ్రీనివాస్ నేతృత్వంలో సీఐ నాగరాజు, బల్మూరు ఎస్సై రాజేందర్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం పర్యవేక్షిస్తోంది. టాలీవుడ్ సెన్సేషనల్ జంట తమ సొంత ఊరిలో, అదీ సంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకోవడం సోషల్ మీడియాలో సైతం హాట్ టాపిక్ గా మారింది.



More Telugu News