ఇలాంటి వినోదం అవసరమా?.. టీ20 వరల్డ్ కప్ నిర్వాహకులపై గవాస్కర్, శాస్త్రి ఫైర్

  • టీ20 వరల్డ్ కప్‌లో లేజర్ షోపై వివాదం
  • నిర్వాహకుల తీరుపై గవాస్కర్, రవిశాస్త్రి తీవ్ర అసహనం
  • ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బతింటుందని గవాస్కర్ హెచ్చరిక
  • ఇది మ్యూజిక్ కాన్సర్ట్ కాదంటూ శాస్త్రి చురకలు
  • ఈడెన్ గార్డెన్స్‌లో భారత్-వెస్టిండీస్ మ్యాచ్‌లో ఘటన
టీమిండియా మాజీ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి.. టీ20 ప్రపంచకప్ నిర్వాహకులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భారత్, వెస్టిండీస్ మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో, డ్రింక్స్ బ్రేక్ సమయంలో లేజర్ షో నిర్వహించడాన్ని వారు తప్పుబట్టారు. ఆట కంటే ఇలాంటి హంగామా ఎక్కువైందని విమర్శించారు.

మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతున్న దశలో డ్రింక్స్ విరామం వచ్చింది. ఈ సమయంలో నిర్వాహకులు స్టేడియంలో లైట్లు ఆపివేసి లేజర్ షోను ప్రదర్శించారు. కామెంట్రీ బాక్స్‌లో ఉన్న గవాస్కర్ దీనిపై స్పందిస్తూ "ఆటగాళ్లు వ్యూహాలు రచించుకోవాల్సిన కీలక సమయంలో ఈ వినోదం అవసరమా? ఇలాంటి మెరుపులు వారి ఏకాగ్రతను దెబ్బతీస్తాయి" అని అన్నారు.

గవాస్కర్‌కు మద్దతుగా రవిశాస్త్రి కూడా తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. "ఇది క్రికెట్ మ్యాచ్, ఏదో మ్యూజిక్ కాన్సర్ట్ కాదు. ఆట మీద దృష్టి పెట్టనివ్వండి. ఇలాంటి ప్రదర్శనలు బయట చూసుకోవచ్చు" అని నిర్వాహకులకు చురకలంటించారు.

క్రికెట్ మ్యాచ్‌ల మధ్యలో ఇలాంటి లేజర్ షోలు నిర్వహించడంపై విమర్శలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో పలువురు విదేశీ ఆటగాళ్లు కూడా ఈ తరహా లైట్ల వల్ల తమ కళ్లు బైర్లు కమ్ముతున్నాయని, ఇబ్బందిగా ఉందని ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఐసీసీ ఇలాంటి వాటిని అనుమతించడంపై క్రీడా విశ్లేషకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


More Telugu News