ఒత్తిడిలో సంజూ క్లాస్ ఇన్నింగ్స్.. పాక్ ఫ్యాన్స్ ఫిదా!

  • టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్స్‌లో భారత్
  • వెస్టిండీస్‌పై సంజూ శాంసన్ అద్భుత ఇన్నింగ్స్
  • ఒత్తిడిలో 97 పరుగులతో జట్టును గెలిపించిన సంజూ
  • శాంసన్‌పై సరిహద్దులు దాటి వస్తున్న ప్రశంసలు
  • ఆటతీరును మెచ్చుకుంటున్న పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు
టీ20 ప్రపంచకప్ 2026 సెమీ ఫైనల్స్‌లోకి భారత్ అడుగుపెట్టింది. వెస్టిండీస్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో సంజూ శాంసన్ ఆడిన అద్భుత ఇన్నింగ్స్ జట్టుకు విజయాన్ని అందించింది. కేవలం 3 పరుగుల తేడాతో శతకం చేజార్చుకున్నా, సంజూ ఆడిన 97 పరుగుల ఇన్నింగ్స్‌పై ఇప్పుడు సరిహద్దులు దాటి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు శాంసన్ ఆటతీరుకు ఫిదా అవుతున్నారు.

వెస్టిండీస్‌తో జరిగిన ఈ కీలక మ్యాచ్‌లో లక్ష్య ఛేదనలో భారత్ ఒత్తిడికి గురైంది. అయితే, సంజూ శాంసన్ నిలకడగా ఆడుతూనే దూకుడు ప్రదర్శించాడు. అతడి ఇన్నింగ్స్ వల్లే భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి, ప్రపంచకప్ టైటిల్‌ను నిలబెట్టుకునే ఆశలను సజీవంగా ఉంచుకుంది.

మ్యాచ్ ముగిసిన వెంటనే సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో పాకిస్థాన్ అభిమానులు సంజూను ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. "ఒత్తిడిలో ఎలా ఆడాలో సంజూ చూపించాడు. ఇదీ బిగ్ మ్యాచ్ టెంపర్‌మెంట్ అంటే" అని ఒకరు పేర్కొన్నారు. "ఈ ఇన్నింగ్స్ విరాట్ కోహ్లీ క్లాసిక్ ఛేజింగ్‌లను గుర్తు చేసింది. ప్రశాంతంగా, లెక్కలేసి, నిర్భయంగా ఆడాడు" అని మరో అభిమాని కామెంట్ చేశాడు.

టోర్నమెంట్‌లో ఎక్కువకాలం అవకాశం కోసం ఎదురుచూసి, వచ్చిన అవకాశాన్ని సంజూ అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడని పలువురు కొనియాడారు. "జట్టులో చోటు సులభం కాదు, కానీ కీలక సమయంలో తన సత్తా చాటాడు. హ్యాట్సాఫ్" అని ఒకరు రాశారు. "వైరాలను పక్కనపెడితే, ఇది ఒత్తిడిలో ఆడిన స్వచ్ఛమైన క్లాస్ ఇన్నింగ్స్" అంటూ మరికొందరు అభిప్రాయపడ్డారు. శాంసన్ ఈ ఇన్నింగ్స్‌తో భారత్‌కు కేవలం మ్యాచ్‌ను మాత్రమే గెలిపించలేదు, సరిహద్దుల ఆవల ఉన్న క్రికెట్ ప్రియుల మనసులను కూడా గెలుచుకున్నాడు.


More Telugu News