పాము తల నరికేశాం: ఇరాన్ సైనిక ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేశామన్న అమెరికా
- ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేశామని అమెరికా ప్రకటన
- ఖమేనీ మృతితో ప్రతీకార దాడులకు దిగిన ఇరాన్
- ఈ ఘర్షణల్లో ముగ్గురు అమెరికా సైనికులు మృతి చెందినట్లు నిర్ధారణ
- ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా సంయుక్త దాడులు కొనసాగింపు
ఆదివారం సెంట్కామ్ విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించింది. "గత 47 ఏళ్లలో ఐఆర్జీసీ 1,000 మందికి పైగా అమెరికన్ల మృతికి కారణమైంది. నిన్నటి భారీ దాడితో ఆ పాము తల నరికేశాం. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైన్యం అమెరికా సొంతం" అని సెంట్కామ్ పేర్కొంది.
ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో ఇరాన్‌పై శనివారం నుంచి సంయుక్త సైనిక చర్యలు చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీతో పాటు పలువురు సీనియర్ సైనిక కమాండర్లు మరణించారు. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా అమెరికా సైనిక స్థావరాలు, ఇజ్రాయెల్‌పై పెద్ద ఎత్తున క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తోంది.
‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’లో ఇప్పటివరకు తమ సైనికుల్లో ముగ్గురు మరణించగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు సెంట్కామ్ అధికారికంగా ధ్రువీకరించింది. ఇరు పక్షాలు దాడులను కొనసాగిస్తామని ప్రకటించడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరాయి.