కొత్త పెళ్లికూతురు రష్మికకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి అర్ధాంగి

  • తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నటి రష్మిక
  • తమ వివాహ రిసెప్షన్ కు రావాలని ఆహ్వానం
  • సీఎం అర్ధాంగి గీత, వారి కుమార్తె నైమిషతో సరదాగా గడిపిన వైనం
  • రేవంత్ ఫ్యామిలీతో గడపడం చాలా సంతోషంగా ఉందన్న బ్యూటీ
  • ఆ గిఫ్ట్‌ను స్పెషల్ అకేషన్‌లోనే ధరిస్తానని రష్మిక ప్రామిస్
కొత్త పెళ్లికూతురు రష్మిక మందన్న తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో ఏడడుగులు వేసిన రష్మిక, సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ సీఎం కుటుంబ సభ్యులతో ఆమె కాసేపు ఆప్యాయంగా గడిపారు. తమ వివాహ రిసెప్షన్ కు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ విషయాన్ని రష్మిక స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు.

సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన అర్ధాంగి గీత, ఆయన కుమార్తె నైమిషలను కలవడం చాలా సంతోషంగా ఉందని రష్మిక పేర్కొన్నారు. వారితో గడిపిన సమయం, జరిపిన సంభాషణలు చాలా మధురంగా సాగాయని తెలిపారు. ఈ కలయికలో సీఎం అర్ధాంగి గీత, రష్మికకు ఒక ప్రత్యేక బహుమతిని అందజేశారు. ఆ గిఫ్ట్ పట్ల మురిసిపోయిన రష్మిక, ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

"గీత గారు ఇచ్చిన బహుమతి చాలా అందంగా ఉంది. దీన్ని నేను కచ్చితంగా ఏదైనా అత్యంత ప్రత్యేకమైన సందర్భంలో ధరిస్తాను" అని రష్మిక పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి కుటుంబంతో రష్మిక దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండను పెళ్లాడిన తర్వాత రష్మిక సీఎం కుటుంబాన్ని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.


More Telugu News