ఆ 5 గ్రామాలను తెలంగాణకు ఇచ్చేయండి: చంద్రబాబుకు సీపీఐ నారాయణ విజ్ఞప్తి

  • ఈ ప్రతిపాదనకు చంద్రబాబు మానవత్వంతో అంగీకరించాలి
  • భద్రాద్రి ఆలయానికి కనీస సౌకర్యాలు లేవని వ్యాఖ్య
  • సామరస్యంగా సమస్యను ముగించాలని సూచన
భద్రాచలం సమీపంలో ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణకు అప్పగించాలనే ప్రతిపాదనకు సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ కె. నారాయణ మద్దతు తెలిపారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానవతా దృక్పథంతో ఆలోచించి, సానుకూలంగా స్పందించాలని ఆయన కోరారు. శనివారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో నారాయణ విలేకరులతో మాట్లాడారు.

ఇటీవల తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం చంద్రబాబును కలిసి ఐదు గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని కోరారని, ఈ ప్రతిపాదన సమంజసంగా ఉందని నారాయణ అన్నారు. "భద్రాద్రి చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణకు ఇవ్వడం ద్వారా మంచి పని చేసినట్టు అవుతుంది. ఈ ప్రతిపాదన న్యాయంగా ఉందని భావిస్తున్నాం" అని ఆయన పేర్కొన్నారు. భద్రాచలం దేవాలయం చాలా పెద్దదని, కానీ ఆలయంలోని చెత్తను పడేయడానికి కూడా స్థలం లేని దుస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వామివారి విహార యాత్రకు కూడా వీలు లేకుండా పోయిందని అన్నారు.

రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు ఈ ఐదు గ్రామాల విషయంలో పట్టుదలకు పోకుండా, సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని నారాయణ సూచించారు.


More Telugu News