Chandrababu Naidu: బాణసంచా విషాదం: రూ.20 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటన... స్పాట్ లో నలుగురు అధికారులపై చంద్రబాబు వేటు

Chandrababu Naidu Announces Ex Gratia After Kakinada Fire Accident
  • మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల ఆర్థిక సాయం
  • నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆర్డీఓ డీఎస్పీ సహా నలుగురు అధికారుల సస్పెన్షన్
  • బాణసంచా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి
  • నిబంధనలు ఉల్లంఘించే వారి ఆస్తులు జప్తు చేస్తామని సీఎం హెచ్చరిక
  • బాధిత కుటుంబాల పిల్లలకు ఉచిత విద్య ఇళ్లు నిర్మించి ఇస్తామని భరోసా
కాకినాడలో జరిగిన ఘోర బాణసంచా పేలుడు ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో గాయపడి కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించిన ఆయన, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీఎం.. మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా తన వంతుగా రూ. 2 లక్షల సాయం అందించిందని తెలిపారు.

ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 20 మంది మృతి చెందారని, మరో 9 మంది పరిస్థితి విషమంగా ఉందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల్లో 12 మంది ఎస్సీలు, 9 మంది మహిళలు ఉన్నారని, వీరంతా కేవలం పూట గడవడం కోసం కూలీ పనులకు వెళ్లిన నిరుపేదలని సీఎం గుర్తుచేసుకున్నారు. ఇలాంటి హృదయ విదారక ఘటనలు పునరావృతం కాకూడదని, అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడేవారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. బాణసంచా కేంద్రాల నిర్వహణలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారులపై అక్కడికక్కడే వేటు

స్థానిక అధికారుల నిర్లక్ష్యంపై తీవ్రంగా మండిపడ్డ సీఎం చంద్రబాబు.. అక్కడికక్కడే సంచలన నిర్ణయం తీసుకున్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఆర్డీఓ, డీఎస్పీ, డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రెస్ మీట్ ద్వారా ప్రకటించారు. విచారణ ఇంకా కొనసాగుతుందని, ఈ ఘటనకు బాధ్యులైన ఇతర అధికారులపైనా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కేవలం అనుమతులు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదని, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో పర్యవేక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే యజమానులపై ఉక్కుపాదం మోపుతామని సీఎం వార్నింగ్ ఇచ్చారు. కొంతమంది విచ్చలవిడితనానికి అలవాటుపడి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని, అటువంటి వారిని అరెస్ట్ చేయడమే కాకుండా ప్రాసిక్యూషన్ చేస్తామన్నారు. అంతేకాకుండా వారి ఆస్తులను జప్తు చేసి, ఆ డబ్బును బాధితులకు అందజేస్తామని స్పష్టం చేశారు. పేలుడు పదార్థాలు ఉన్నచోట తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు పాటించలేదని, కేవలం లాభాపేక్షతో మనుషులను నియమించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోందని చంద్రబాబు వివరించారు. చనిపోయిన వారిని తిరిగి తీసుకురాలేమని, కానీ వారి కుటుంబాలు రోడ్డున పడకుండా చూస్తామన్నారు. బాధితుల పిల్లలకు రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉచిత విద్యనందిస్తామని, ఇళ్లు లేని వారికి ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇస్తుందని హామీ ఇచ్చారు. తీవ్రంగా గాయపడిన వారికి కూడా ఆర్థిక సాయం, వైద్య సాయం అందిస్తామన్నారు.

రాష్ట్రంలో ఎన్ని బాణసంచా కేంద్రాలు ఉన్నాయో పూర్తి సమాచారం సేకరిస్తామని, ప్రస్తుతం ఉన్న నిబంధనలు, ప్రొసీజర్స్ సరిపోవడం లేదని సీఎం అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రతి తయారీ కేంద్రంలోనూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటిని కంట్రోల్ రూములకు అనుసంధానిస్తామన్నారు. అనుమతుల ప్రక్రియను మరింత కఠినతరం చేస్తామని, ప్రజల భద్రతే తమకు ముఖ్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ప్రార్థించారు.


Chandrababu Naidu
Kakinada fire accident
fireworks explosion
ex gratia
officials suspended
Andhra Pradesh
accident compensation
fire safety
negligence
Kakinada

More Telugu News