టీటీడీ వార్షిక బడ్జెట్ ప్రకటన... పూర్తి వివరాలు ఇవిగో!

  • 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.5,456.26 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం
  • విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కోసం రూ.118.89 కోట్లు కేటాయింపు
  • తిరుమలలో రిలయన్స్ సహకారంతో కొత్త అన్న ప్రసాద భవనం నిర్మాణం
  • యూపీఐ ద్వారా శ్రీవారి ముడుపు పత్రం పథకం ప్రయోగాత్మక పరిశీలన
  • సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసేవారిపై చట్టపరమైన చర్యలు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.5,456.26 కోట్ల భారీ బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేసింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన శనివారం జరిగిన బోర్డు సమావేశంలో భక్తుల సౌకర్యాలు, ఆలయాల అభివృద్ధి, భద్రతా ప్రమాణాల పెంపుపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ టీటీడీ చరిత్రలోనే తొలిసారిగా విద్యా సంస్థల అభివృద్ధికి రూ.118.89 కోట్లను కేటాయించారు. ఈ నిధులతో డిజిటల్ క్లాస్ రూములు, హాస్టల్ బ్లాకులు, వంటగదుల ఆధునికీకరణ చేపట్టనున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీకి అనుగుణంగా అన్న ప్రసాద వితరణను మరింత విస్తరించేందుకు రిలయన్స్ సంస్థ ముందుకొచ్చింది. సుమారు రూ.100 కోట్ల నుంచి 120 కోట్ల మేర రిలయన్స్ అందించే విరాళాలతో అధునాతన అన్న ప్రసాద భవనం, వంటశాల నిర్మాణానికి బోర్డు ఆమోదం తెలిపింది. అలాగే, భక్తులు తమ మొక్కులను సులభంగా చెల్లించుకునేందుకు 'శ్రీవారి ముడుపు పత్రం' పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు. దీని ద్వారా భక్తులు యూపీఐ ద్వారా చెల్లింపులు జరిపి, ముడుపు పత్రాన్ని పొంది నేరుగా హుండీలో సమర్పించవచ్చు.

ఆధ్యాత్మిక వ్యాప్తిలో భాగంగా దేశవ్యాప్తంగా ఆలయాల నిర్మాణానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. కోయంబత్తూర్, గువహటి, బెలగావి, పాట్నా (మోకామా) నగరాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించిన స్థలాల్లో శ్రీవారి ఆలయాలను నిర్మించనున్నారు. అలాగే పార్వతీపురం మన్యం జిల్లాలో శ్రీ వేంకటేశ్వర దివ్య క్షేత్ర నిర్మాణానికి రూ.14.25 కోట్లు కేటాయించారు. 

వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం ఏర్పాటుకు డ్రై ఐలాండ్ నిర్మాణం కోసం రూ.20.17 కోట్లు మంజూరు చేశారు. ఏప్రిల్ 1న ఒంటిమిట్టలో జరిగే సీతారాముల కల్యాణానికి హాజరయ్యే దాదాపు 70 వేల మంది భక్తులకు అదనంగా ఒక్కోటి రూ.50 విలువైన తిరుమల లడ్డును ఉచితంగా అందించాలని నిర్ణయించారు.

భద్రత విషయంలోనూ టీటీడీ కఠిన చర్యలు చేపట్టింది. అలిపిరి తనిఖీ కేంద్రంలో రూ.8 కోట్లతో అత్యాధునిక స్కానర్లు ఏర్పాటు చేయనున్నారు. తిరుపతిలో రూ.10.75 కోట్లతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసి, దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆస్తులను పర్యవేక్షించనున్నారు. 

ఆర్మీ వెల్ఫేర్ ద్వారా తిరుపతి, తిరుమలలో మొత్తం 727 మంది భద్రతా సిబ్బందిని నియమించుకోనున్నారు. వకుళమాత ఆలయంలో 'అక్షర గోవిందం' పేరుతో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

ఆలయాలు, ప్రాకారాలు, రాజగోపురాల నిర్మాణ వ్యయాలను దృష్టిలో ఉంచుకుని శ్రీ‌వాణి ట్రస్ట్ మార్గదర్శకాల మార్పుకు ఆమోదం తెలిపారు.

చివరగా, సోషల్ మీడియాలో తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా అసత్య కథనాలతో రీల్స్ చేసేవారిపై చైర్మన్ బీఆర్ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వప్రయోజనాల కోసం భక్తుల మనోభావాలతో ఆడుకుంటే సహించేది లేదని, అటువంటి వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భక్తుల సౌకర్యం, పారదర్శకతే తమ ప్రథమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.


More Telugu News