ఫార్ములా ఈ రేసు కేసు.. సీనియర్ ఐఏఎస్ అధికారిపై సస్పెన్షన్ వేటు?
- ఫార్ములా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అర్వింద్ కుమార్‌పై వేటు
- పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
- ఆయన ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతినిచ్చిన కొన్ని రోజులకే చర్యలు
ఫార్ములా ఈ రేసు నిర్వహణలో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో అర్వింద్ కుమార్‌ను ప్రాసిక్యూట్ చేసేందుకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీఓపీటీ) ఫిబ్రవరి మధ్యలో అనుమతినిచ్చింది. ఈ అనుమతి లభించిన కొన్ని రోజులకే రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై బదిలీ వేటు వేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అర్వింద్ కుమార్ ఉన్నారు. ఆ సమయంలోనే ఫార్ములా ఈ రేసు కోసం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) నుంచి దాదాపు రూ.55 కోట్లను రాష్ట్ర కేబినెట్, ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా బదిలీ చేశారని ఏసీబీ ఆరోపిస్తోంది. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌ను ఏ-1గా, అర్వింద్ కుమార్‌ను ఏ-2గా పేర్కొంటూ ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
కేంద్రం నుంచి ప్రాసిక్యూషన్‌కు అనుమతులు రావడంతో, ఏసీబీ త్వరలోనే ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో శాఖాపరమైన చర్యల్లో భాగంగానే అర్వింద్ కుమార్‌ను పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ చేయడం, సస్పెన్షన్ వేటుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.