Yejra Prabhakar: రియాద్‌లో దారుణం: తల్లిదండ్రులను చంపి.. ఆత్మహత్య చేసుకున్న రాజమండ్రి విద్యార్థి

Yejra Prabhakar Rajahmundry Student Kills Parents Commits Suicide in Riyadh
  • ఆన్‌లైన్ గేమ్స్ విషయంలో మందలించడమే కారణం
  • హత్య అనంతరం ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ 
  • తిన్నాక భవనం పైనుంచి దూకి ఆత్మహత్య
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసైన ఓ విద్యార్థి, కన్న తల్లిదండ్రులనే అత్యంత కిరాతకంగా హతమార్చి, ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రియాద్‌లోని తెలుగు ప్రవాసీ సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన గాలి రవి (49), శ్రీదేవి (43) దంపతులు రియాద్‌లోని హరా ప్రాంతంలో నివసిస్తున్నారు. వీరి ఒక్కగానొక్క కుమారుడు యెజ్ర ప్రభాకర్ స్థానిక భారతీయ పాఠశాలలో ప్లస్ 2 చదువుతున్నాడు. ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసైన ప్రభాకర్‌తో తల్లిదండ్రులకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడని వారు మందలిస్తూ వచ్చారు.

గురువారం రాత్రి ఇదే విషయమై మరోసారి మందలించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ప్రభాకర్, విచక్షణ కోల్పోయి తల్లిదండ్రులను కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసి తిన్నాడు. కొంతసేపటికి తాను నివసిస్తున్న భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

రవి ఓ బ్యాంకులో, శ్రీదేవి ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ అందరితో స్నేహంగా ఉండేవారని స్థానిక ప్రవాసీయులు గుర్తు చేసుకున్నారు. కన్నకొడుకు చేతిలోనే ఇంత దారుణంగా చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నామని కన్నీటిపర్యంతమయ్యారు.  
Yejra Prabhakar
Riyadh
Saudi Arabia
Rajahmundry
Online Games
Suicide
Parents Murder
Telugu NRI
Crime News
East Godavari

More Telugu News