కర్ణాటకలో మోరల్ పోలీసింగ్.. ముస్లిం అమ్మాయి పక్కన కూర్చున్నారని హిందూ విద్యార్థులపై దాడి

  • దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • ఇలాంటివి సహించబోమని స్పష్టం చేసిన సీఎం సిద్ధరామయ్య
  • తీరప్రాంత, మల్నాడు ప్రాంతాల్లో కొనసాగుతున్న ఘటనలు
కర్ణాటకలో మరో నైతిక పోలీసింగ్ (మోరల్ పోలీసింగ్) ఘటన వెలుగుచూసింది. వేరే మతానికి చెందిన విద్యార్థిని పక్కన కూర్చున్నారన్న కారణంతో ఇద్దరు విద్యార్థులపై తోటి విద్యార్థులే దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన చిక్కమగళూరు నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాల బస్సులో శుక్రవారం చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం, సహ్యాద్రి కళాశాలకు చెందిన ఒక ముస్లిం విద్యార్థిని, ఇద్దరు హిందూ విద్యార్థులు యోగేష్, జయంత్ కాలేజీ బస్సులో ఒకే సీట్లో కూర్చుని ప్రయాణిస్తున్నారు. స్నేహితులైన వీరు కలిసి కూర్చోవడాన్ని చూసిన అదే కాలేజీకి చెందిన సలీద్, రషీద్ అనే ముస్లిం విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం అమ్మాయి పక్కన ఎందుకు కూర్చున్నావంటూ యోగేష్‌ను ప్రశ్నించి, అతడిపై దాడి చేసి మొబైల్ ఫోన్ లాక్కున్నారు. అడ్డుకోబోయిన జయంత్‌పైనా వారు దాడి చేశారు.

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కళాశాల యాజమాన్యం బసవనహళ్లి పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, దాడికి పాల్పడిన విద్యార్థులతో పాటు బాధితులను పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా స్పందించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేవారు ఎవరైనా సరే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో నైతిక పోలీసింగ్‌ను ఏమాత్రం సహించబోమని, ఈ విషయంలో "జీరో టాలరెన్స్" విధానాన్ని అవలంబిస్తున్నామని పునరుద్ఘాటించారు.  


More Telugu News