ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ అంటే ఎందుకంత ప్రేమ?: అసదుద్దీన్ ఫైర్

  • మోదీ ఇజ్రాయెల్ ప్రేమ వెనుక ఉన్నది ఆర్ఎస్ఎస్ భావజాలమేనన్న ఒవైసీ
  • నెతన్యాహు లాంటి యుద్ధ నేరస్తుడిని ఆలింగనం చేసుకోవడం సరికాదని వ్యాఖ్యలు
  • బంగ్లా మాజీ ప్రధానిని వెనక్కి పంపాలన్న అసదుద్దీన్ ఒవైసీ
  • దేశంలో ముస్లింలపై ద్వేషపూరిత దాడులు పెరిగాయని ఆవేదన
  • ఓటర్ల జాబితా సవరణ పేరుతో బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపణ
ప్రధాని నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ పట్ల ఉన్న ప్రేమ వెనుక బలమైన భావజాలం ఉందని, ఆర్ఎస్ఎస్ మరియు జియోనిస్టుల సిద్ధాంతాలు రెండూ ద్వేషం పునాదిగానే సాగుతాయని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మసీదు-ఏ-చౌక్‌లో జరిగిన 'జల్సా-ఏ-యౌమ్-ఉల్-ఖురాన్' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు.

గాజాలో 73,000 మంది పాలస్తీనియన్ల మరణానికి కారణమైన ఇజ్రాయెల్ ప్రభుత్వానికి ప్రధాని మోదీ బహిరంగ మద్దతు తెలపడం దేశ ప్రయోజనాలకు విరుద్ధమని ఒవైసీ అన్నారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ చేసిందని, ఆయన యూరప్ కూడా వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. అలాంటి యుద్ధ నేరస్తుడిని ఆలింగనం చేసుకోవడం ద్వారా పాలస్తీనాకు భారత్ ఇన్నాళ్లుగా ఇస్తున్న మద్దతుకు మోదీ తూట్లు పొడిచారని విమర్శించారు. ఇజ్రాయెల్ అనేది ప్రపంచంలోనే ఏకైక జాత్యహంకార దేశమని, వెస్ట్ బ్యాంక్, గాజాలను బహిరంగ జైళ్లుగా మార్చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా చారిత్రక అంశాలను ప్రస్తావించిన ఒవైసీ, ఆర్ఎస్ఎస్, జియోనిస్టుల మధ్య బంధం చాలా పాతదని ఆరోపించారు. 1960లలో జనసంఘ్ ప్రతినిధులు, 1973లో గోపాల్ గాడ్సే ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్‌ను కలిసి ముస్లిం వ్యతిరేక అజెండాపై చర్చించారని ఆయన గుర్తు చేశారు. బంగ్లాదేశ్ అంశంపై స్పందిస్తూ.. అక్కడ హిందువుల రక్షణను తాము కూడా కోరుకుంటున్నామని, అయితే శరణార్థిగా ఉన్న షేక్ హసీనాను తిరిగి బంగ్లాదేశ్ పంపిస్తే ఆ సమస్య పరిష్కారమవుతుందని సూచించారు.

దేశంలో రంజాన్ మాసంలో కూడా ముస్లింలపై ద్వేషపూరిత నేరాలు, మూక దాడులు పెరిగిపోతున్నాయని ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక తెలంగాణలో వచ్చే నెలలో జరగనున్న ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను అడ్డుపెట్టుకుని ఓటర్ల పేర్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని, దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.




More Telugu News