పవన్ క్యాంపు కార్యాలయంలోకి చొరబడిన వ్యక్తి... రెండు వాహనాలు ధ్వంసం!

  • జనసేన కేంద్ర కార్యాలయంలోకి చొరబడిన వ్యక్తి
  • డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్  కాన్వాయ్ వాహనాల ధ్వంసం
  • నిందితుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన నీలాద్రిగా గుర్తింపు
  • పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో మానసిక స్థితిపై అనుమానాలు
  • ఘటనపై ఐజీ, ఎస్పీల విచారణ.. రాజకీయ కుట్ర కోణంలోనూ దర్యాప్తు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయం వద్ద శుక్రవారం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మంగళగిరిలో జనసేన ప్రధాన కార్యాలయంలోకి ఓ అజ్ఞాత వ్యక్తి ప్రవేశించి వీరంగం సృష్టించాడు. పవన్ కల్యాణ్ కాన్వాయ్‌లోని రెండు వాహనాలపై దాడి చేసి ధ్వంసం చేయడంతో కార్యాలయ ఆవరణలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం విజయవాడ నుంచి ఆటోలో వచ్చిన సదరు వ్యక్తి నేరుగా కార్యాలయం లోపలికి ప్రవేశించాడు. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఎస్ఓ) గదిలోకి వెళ్లి సుమారు పావుగంట సేపు అక్కడే గడిపాడు. భద్రతా సిబ్బంది అతడిని ప్రశ్నించడంతో వాగ్వాదానికి దిగి, వారిని తోసివేశాడు. అనంతరం అక్కడే ఉన్న ఒక కర్రను తీసుకుని కాన్వాయ్‌లోని వాహనాల అద్దాలను పగులగొట్టాడు. వెంటనే అప్రమత్తమైన జనసేన సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని మంగళగిరి పోలీసులకు సమాచారం అందించారు.

నిందితుడిని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ప్రాంతానికి చెందిన నీలాద్రిగా పోలీసులు గుర్తించారు. ప్రజావాణి కార్యక్రమంలో తన సమస్యపై వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చినట్లు ప్రాథమిక సమాచారం. అయితే, విచారణ సమయంలో అతడు పొంతనలేని సమాధానాలు ఇస్తుండటంతో, అతడికి మతిస్థిమితం సరిగా లేదేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఘటన తెలిసిన వెంటనే గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నిందితుడిని స్వయంగా విచారించారు. కేవలం మానసిక స్థితి కారణంగానే దాడి చేశాడా? లేక దీని వెనుక ఏదైనా రాజకీయ కుట్ర దాగి ఉందా? అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఇదే కార్యాలయం వద్ద డ్రోన్ సంచారం కలకలం రేపిన నేపథ్యంలో, తాజా ఘటనతో జనసేన శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.


More Telugu News