ఏపీ నూతన సీఎస్‌గా సాయిప్రసాద్.. ఎంటెక్ నుంచి సీఎస్ వరకు ప్రస్థానం

  • రేపటితో ముగుస్తున్న విజయానంద్ పదవీ కాలం
  • కొత్త సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించనున్న సాయిప్రసాద్
  • సాయిప్రసాద్ 1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి జి. సాయిప్రసాద్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రస్తుత చీఫ్ సెక్రటరీ కె. విజయానంద్ పదవీ కాలం రేపటితో (ఫిబ్రవరి 28) ముగియనుంది. ఈ నేపథ్యంలో, విజయానంద్ స్థానంలో సాయిప్రసాద్ ను నియమిస్తూ ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. రేపు ఉదయం సచివాలయంలో కొత్త సీఎస్‌గా సాయిప్రసాద్ బాధ్యతలను స్వీకరిస్తారు. 


1991 బ్యాచ్ ఏపీ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి జి. సాయిప్రసాద్ 'ఎంటెక్' చదివారు. సివిల్ సర్వీసులోకి ప్రవేశించి 1992లో వరంగల్ అసిస్టెంట్ కలెక్టర్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 1993-95 మధ్య పాడేరు అసిస్టెంట్ కలెక్టర్‌గా గిరిజన ప్రాంతాల్లో సేవలందించారు. 1995 నుంచి 1997 వరకు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా... 1997-98 మధ్య కాలంలో కడప జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. 2000 నుంచి 2003 వరకు కర్నూలు జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు.


సాయి ప్రసాద్ విద్యుత్ రంగం, గృహనిర్మాణ రంగాల్లో కూడా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఏపీ ట్రాన్స్‌కో జాయింట్ ఎండీ, ఈపీడీసీఎల్ సీఎండీ, ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ, ఏపీ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్‌గా సేవ‌లందించారు. 2011 నుంచి 2014 వరకు కేంద్ర ప్రభుత్వ ఇంధన శాఖలో సంయుక్త కార్యదర్శిగా కూడా పనిచేశారు. సాయిప్రసాద్ 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శిగా, ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత సోలార్ పవర్ కార్పొరేషన్ సీఎండీగా, ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2024 నుంచి జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు.



More Telugu News