అధికారులే పులిని వదిలారు.. దాన్ని చంపేస్తాం: రంపచోడవరం ఏజెన్సీ గిరిజనుల హెచ్చరిక

  • ఈ నెల 6న రాజమండ్రి పరిసరాల్లో పట్టుబడ్డ పెద్దపులి
  • వారం క్రితం పాపికొండల అభయారణ్యంలో వదిలిన అధికారులు
  • ఐదు రోజులుగా బోలగొండ ఫారెస్ట్ పరిధిలో సంచరిస్తున్న పులి
  • గత రాత్రి ఆవుదూడపై దాడి చేసిన వైనం
  • పులిపై దాడి చేస్తామని హెచ్చరిస్తున్న గిరిజనులు

పాపికొండల అభయారణ్యంలో వదిలిపెట్టిన 'ఎక్స్‌ప్లోరర్' అనే పెద్దపులి ఇప్పుడు రంపచోడవరం ఏజెన్సీ గ్రామాలను వణికిస్తోంది. అడవి నుంచి పులి గ్రామాల వైపు వస్తుండటంతో తమ ప్రాణాలకు రక్షణ లేదంటూ గిరిజనులు యుద్ధానికి సిద్ధమవుతున్నారు. అధికారులే కావాలని పులిని తమ గ్రామాలపైకి వదిలారని ఆగ్రహిస్తున్నారు. విల్లులు-బాణాలతో పులిపై ఎదురుదాడికి దిగుతామని ఆదివాసీలు హెచ్చరిస్తుండటంతో మన్యంలో హైటెన్షన్ నెలకొంది.


ఈ నెల 6న రాజమండ్రి పరిసరాల్లో పట్టుబడ్డ ఈ పెద్దపులికి 'ఎక్స్‌ప్లోరర్' అని నామకరణం చేసి, వారం క్రితం పాపికొండల అభయారణ్యంలో అటవీ శాఖ అధికారులు విడిచిపెట్టారు. అయితే, గత ఐదు రోజులుగా ఇది బోలగొండ ఫారెస్ట్ పరిధిలోని రంప, మర్రవాడ, పెద్ద గొండ గ్రామాలకు సమీపంలోనే సంచరిస్తోంది. గత రాత్రి ఒక ఆవుదూడపై దాడి చేయడంతో గిరిజనుల సహనం నశించింది.


ప్రస్తుతం అడవిలో జీడిపిక్కలు సేకరించే కీలక సమయం కావడంతో పులి భయం కారణంగా గిరిజనులు అటవీ ప్రాంతంలోకి వెళ్లలేకపోతున్నారు. దీనివల్ల తమ ఫలసాయాన్ని కోల్పోతున్నామని, ఇప్పటికే అనేక సమస్యలతో ఉన్న తమపైకి పులిని తెచ్చిపెట్టడమేంటని వారు నిలదీస్తున్నారు. "అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి మా గ్రామాలపైకి పులిని వదిలారు. మా ప్రాణాలు కాపాడుకోవడానికి మా దగ్గర ఉన్న బాణాలతో పులిపై దాడి చేస్తాం" అంటూ ఆదివాసి భారత్ పార్టీ ఇంచార్జ్ అంజిరెడ్డి ఒక వీడియో సందేశం ద్వారా హెచ్చరించారు.


ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో ఫారెస్ట్ రేంజ్ అధికారులు రంగంలోకి దిగారు. పులి తన దారిన తాను వెళ్ళిపోతుందని, మరో రెండు రోజుల పాటు గిరిజనులు అడవిలోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. పులి దాడిలో గాయపడిన ఆవుదూడకు పశు సంవర్ధక శాఖ సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించారు.



More Telugu News