AP High Court: మైనింగ్ వివాదం: అటవీ అధికారులకు ఏపీ హైకోర్టు సమన్లు

AP High Court Summons Forest Officials in Mining Dispute
  • బోయకొండ రిజర్వ్ ఫారెస్ట్ సరిహద్దుపై అసంపూర్ణ నివేదిక అందజేసిన అటవీ అధికారులు
  • 20 పేజీల నివేదికకు బదులు 4 పేజీలే సమర్పించడంపై హైకోర్టు అసహనం 
  • చిత్తూరు డీఎఫ్‌వో, రేంజ్ అధికారి స్వయంగా హాజరుకావాలని హైకోర్టు ఆదేశం
  • తదుపరి విచారణ మార్చి 3వ తేదీకి వాయిదా
ఓ మైనింగ్ కంపెనీకి సంబంధించిన వివాదంలో అసంపూర్ణ నివేదికను సమర్పించడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కీలకమైన నివేదికలో కొన్ని పేజీలను మాత్రమే కోర్టు ముందు ఉంచడంపై అనుమానం వ్యక్తం చేస్తూ, పూర్తి వివరాలతో స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని చిత్తూరు జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌వో), సంబంధిత ఫారెస్ట్ రేంజ్ అధికారిని ఆదేశించింది. 

వివరాల్లోకి వెళితే, చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం చంద్రమాకులపల్లి గ్రామ పరిధిలోని 2.880 హెక్టార్ల విస్తీర్ణంలో తమ మైనింగ్ కార్యకలాపాలను నిలిపివేయాలని పలమనేరు మైనింగ్ అధికారి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సూర్య రాక్స్ అనే సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఈ వివాదంలో కీలకమైన బోయకొండ రిజర్వ్ ఫారెస్ట్ సరిహద్దును నిర్ధారించేందుకు రెవెన్యూ, అటవీ, మైనింగ్ శాఖలు ఉమ్మడిగా సర్వే నిర్వహించి 20 పేజీల నివేదికను రూపొందించాయి. 

అయితే, ఈ కేసుకు సంబంధించి కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌కు కేవలం 4 పేజీల నివేదికను మాత్రమే జత చేయడాన్ని న్యాయస్థానం గుర్తించింది. పూర్తి నివేదికను ఎందుకు సమర్పించలేదని ప్రశ్నిస్తూ, అధికారుల తీరుపై అనుమానం వ్యక్తం చేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు, సదరు అధికారులు మార్చి 3న జరగనున్న తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
 
AP High Court
Andhra Pradesh High Court
Mining Dispute
Chittoor DFO
Forest Officials
Surya Rocks
Palamaneru Mining Officer
Boyakonda Reserve Forest
Mining Activities
Incomplete Report

More Telugu News