నా ప్రాణ స్నేహితురాలినే భార్యగా చేసుకున్నా... పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్!

Vijay Deverakonda Marries Best Friend Rashmika Emotional Post
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, ప్రముఖ నటి రష్మిక మందన్న గురువారం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట, అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ పెళ్లి చేసుకున్నారు. వివాహం అనంతరం విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫొటోలు, వీడియోలను పంచుకుంటూ ఓ భావోద్వేగభరితమైన నోట్‌ను రాశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రష్మిక తన జీవితంలోకి ఎలా భాగమైందో వివరిస్తూ విజయ్ ఓ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. "ఒకరోజు తను గుర్తొచ్చింది. తను పక్కన లేకపోతే నా రోజు అసంపూర్ణంగా అనిపించింది. తను ఎదురుగా కూర్చుని ఉంటేనే నా భోజనం సంపూర్ణంగా అనిపించేది. తనతో కలిసి వర్కౌట్లు చేస్తే అవి శిక్షలా కాకుండా సరదాగా అనిపించేవి. నేను ఎక్కడ ఉన్నా, ఇల్లు అనే భావన, ప్రశాంతత కలగాలంటే తను కావాలనిపించింది. అందుకే నా ప్రాణ స్నేహితురాలినే నా భార్యగా చేసుకున్నా" అంటూ రష్మికపై తనకున్న ప్రేమను విజయ్ అక్షర రూపంలో పంచుకున్నారు.

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న 'మెమెంటోస్ బై ఐటీసీ హోటల్స్, ఏకాయ' వేదికగా వీరి వివాహ వేడుక అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు, చిత్ర పరిశ్రమకు చెందిన కొద్దిమంది మిత్రుల సమక్షంలో జరిగింది. 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' వంటి చిత్రాల్లో కలిసి నటించి ప్రేక్షకుల మన్ననలు పొందిన ఈ జంట, నిజ జీవితంలోనూ ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత ఇరు కుటుంబాల వారు వేదిక బయట వేచి ఉన్న మీడియా సిబ్బందికి మిఠాయిలు పంచి తమ సంతోషాన్ని పంచుకున్నారు.

ఈ వివాహానికి 'ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్' అని అధికారికంగా పేరు పెట్టడం విశేషం. ఈ పేరును ప్లానర్లు గానీ, కుటుంబ సంప్రదాయాల ప్రకారం గానీ పెట్టలేదని, ఏళ్ల క్రితం తమ అభిమానులు ప్రేమగా తమ పేర్లను కలిపి సృష్టించిన 'విరోష్' అనే పేరునే ఎంచుకున్నామని ఈ జంట ఫిబ్రవరి 22న ప్రకటించింది. పెళ్లికి ముందు జరిగిన హల్దీ వేడుకకు సంబంధించిన ఫొటోలను కూడా విజయ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకున్నారు. సంప్రదాయం, వ్యక్తిగత హంగులు కలగలిపి ఈ వేడుకను ఎంతో అందంగా నిర్వహించారు. ఎట్టకేలకు ఈ స్టార్ జంట పెళ్లి చేసుకోవడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Go Back to Shorts
Vijay Deverakonda
Rashmika Mandanna
Vijay Rashmika wedding
Telugu cinema
Geetha Govindam
Dear Comrade
ViRosh wedding
Tollywood couple
Indian celebrity wedding
Udaipur wedding

More Telugu News