ఇండియా-జింబాబ్వే మ్యాచ్.. అభిమానులకు చెన్నై మెట్రో బంపర్ ఆఫర్!

  • ఇండియా-జింబాబ్వే మ్యాచ్ కోసం చెన్నైలో ప్రత్యేక మెట్రో ఏర్పాట్లు
  • మ్యాచ్ టికెట్ చూపిస్తే అభిమానులకు ఉచిత ప్రయాణ సౌకర్యం
  • టికెట్‌పై ఉన్న క్యూఆర్ కోడ్ మెట్రో పాస్‌గా పనిచేస్తుందన్న అధికారులు
  • రాత్రి ప్రయాణికుల కోసం అర్ధరాత్రి వరకు మెట్రో సర్వీసుల పొడిగింపు
  • అభిమానుల సౌకర్యార్థం టీఎన్‌సీఏతో చెన్నై మెట్రో ఒప్పందం
టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశలో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఇవాళ‌ భారత్, జింబాబ్వే మధ్య జరగనున్న కీలక మ్యాచ్ కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మ్యాచ్‌కు వేలాదిగా తరలివచ్చే క్రికెట్ అభిమానుల సౌకర్యార్థం చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (CMRL) కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు అభిమానులకు ఉచిత ప్రయాణం కల్పించడంతో పాటు అర్ధరాత్రి వరకు ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది.

అభిమానులు తమ వద్ద ఉన్న మ్యాచ్ టికెట్లను ఉపయోగించి ఉచితంగా మెట్రోలో ప్రయాణించవచ్చు. ప్రతి టికెట్‌పై ఒక ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ ఉంటుందని, ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ (AFC) గేట్ల వద్ద దానిని స్కాన్ చేయడం ద్వారా స్టేషన్‌లోకి ప్రవేశించవచ్చని సీఎంఆర్ఎల్‌ తెలిపింది. ఈ టికెట్ మ్యాచ్ రోజున ఒకసారి రానుపోను ప్రయాణానికి చెల్లుబాటు అవుతుంది. 

ఈ ప్రత్యేక ఏర్పాట్లపై చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (TNCA) సహకారంతో అభిమానులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. అభిమానుల మెట్రో ప్రయాణ ఖర్చులను ఈవెంట్ ఆర్గనైజర్ అయిన టీఎన్‌సీఏ స్పాన్సర్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

మ్యాచ్ రాత్రిపూట ముగియనుండటంతో అభిమానుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సర్వీసులను కూడా పొడిగించారు. గవర్నమెంట్ ఎస్టేట్ స్టేషన్ నుంచి చివరి రైళ్లు అర్ధరాత్రి 12 గంటలకు బయలుదేరతాయని అధికారులు తెలిపారు. ఒక రైలు విమ్కో నగర్ డిపో వైపు, మరొకటి ఎయిర్‌పోర్ట్ కారిడార్ వైపు వెళ్తుంది. అయితే, చివరి రైలు బయలుదేరడానికి 10 నిమిషాల ముందే స్టేషన్ గేట్లను మూసివేస్తారని ప్రయాణికులు గమనించాలి. అలాగే, రాత్రి 11 గంటల తర్వాత గ్రీన్ లైన్‌లోకి మారాలనుకునే ప్రయాణికులు చెన్నై సెంట్రల్ స్టేషన్‌లో మాత్రమే మారేందుకు అవకాశం ఉంటుందని ప్రకటనలో వివరించారు. ఈ చర్యలతో మ్యాచ్‌కు హాజరయ్యే అభిమానులకు రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు భావిస్తున్నారు.


More Telugu News