ఒక్కటైన విజయ్ దేవరకొండ, రష్మిక.. ఉదయ్‌పూర్‌లో ఘనంగా వివాహం

  • రెండు కుటుంబాల సంప్రదాయాల ప్రకారం జరుగుతున్న వివాహం
  • పెళ్లికి ముందు ‘విరోష్ ప్రీమియర్ లీగ్’ పేరుతో క్రికెట్ సందడి
  • మార్చి 4న హైదరాబాద్‌లో సినీ, రాజకీయ ప్రముఖులకు రిసెప్షన్
టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు ఒక్కటయ్యారు. తమ రిలేషన్‌షిప్‌పై కొన్నేళ్లుగా వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ ఇవాళ‌ ఉదయం 10:10 గంటలకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం జరిగింది. విజయ్, రష్మిక మెడలో మూడు ముళ్లు వేసి ఆమెను తన జీవిత భాగస్వామిగా స్వీకరించారు.

ఈ వివాహ వేడుక రెండు విభిన్న సంస్కృతుల కలయికగా అత్యంత వైభవంగా జరుగుతోంది. ఉదయం విజయ్ కుటుంబ పద్ధతిలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి తంతు పూర్తికాగా, ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు రష్మిక కుటుంబ ఆచారాల ప్రకారం మరోసారి వివాహం నిర్వహించనున్నారు. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

పెళ్లికి ముందు జరిగిన వేడుకలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. బుధవారం జరిగిన హల్దీ వేడుక ఫొటోలను ఈ జంట ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా, అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు. అంతకుముందు 'విరోష్ ప్రీమియర్ లీగ్' పేరుతో నిర్వహించిన క్రికెట్ మ్యాచ్ సైతం వైరల్‌గా మారింది. తమ అభిమాన జంట పెళ్లి చేసుకోవడంతో ‘విరోష్’ హ్యాష్‌ట్యాగ్‌తో నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఉదయ్‌పూర్‌లో వివాహం చేసుకున్న ఈ జంట, మార్చి 4న హైదరాబాద్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం భారీస్థాయిలో వెడ్డింగ్ రిసెప్షన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.


More Telugu News