రాజంపేట లాడ్జిలో ఘోర అగ్నిప్రమాదం.. ఒకరి సజీవ దహనం

  • విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు
  • ప్రమాదంలో శ్రీనివాసులు అనే వ్యక్తి సజీవ దహనం
  • 30 మందికి పైగా ప్రయాణికులను కాపాడిన సిబ్బంది
కడప జిల్లా రాజంపేటలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులో ఉన్న దీప్ లాడ్జిలో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఒకరు సజీవ దహనం కాగా, 30 మందికి పైగా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నారు.

దీప్ లాడ్జిలో అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో గదుల్లో బస చేస్తున్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఊపిరాడక, ప్రాణభయంతో కొందరు పైఅంతస్తుకు పరుగులు తీసి కేకలు వేశారు. స్థానికులు పరిస్థితిని గమనించి వెంటనే పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చి, పైఅంతస్తులో చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా కిందకు దించారు. అనంతరం లోపల గదులను పరిశీలించగా, శ్రీనివాసులు అనే వ్యక్తి అప్పటికే మంటల్లో చిక్కుకుని మృతి చెందినట్లు గుర్తించారు.

ప్రమాద సమయంలో లాడ్జిలో మొత్తం 35 మంది ఉన్నారని, వారిలో పట్టణంలో కొత్తగా ప్రారంభమైన ఓ వస్త్ర దుకాణం సిబ్బంది కూడా ఉన్నారని నిర్వాహకులు తెలిపారు. సకాలంలో సహాయక చర్యలు చేపట్టడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News