శ్రీవారి దర్శనంపై హీరోయిన్ శివాని క్లారిటీ.. 15 నిమిషాల దర్శనం రచ్చకు తెర

  • శివానికి 15 నిమిషాల పాటు దర్శనం ఎలా కల్పిస్తారంటూ సోషల్ మీడియాలో భక్తుల ఆగ్రహం
  • క్యూ ప్రారంభం నుంచి దర్శనం వరకు 15 నిమిషాలు అని చెప్పానన్న శివాని
  • 15 నిమిషాల పాటు గర్భాలయంలో ఉన్నానని కాదని స్పష్టీకరణ

‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’, 'లిటిల్ హార్ట్స్' ఫేమ్ శివాని నాగారం ఇటీవల తిరుమల శ్రీవారి దర్శనంపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట పెను దుమారానికి దారితీశాయి. సాధారణ భక్తులను కనురెప్పపాటు కాలంలోనే పక్కకు నెట్టేసే సిబ్బంది, ఒక హీరోయిన్‌కు మాత్రం ఏకంగా 15 నిమిషాల పాటు దర్శనం ఎలా కల్పిస్తారంటూ సోషల్ మీడియాలో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా సెలబ్రిటీలకు ప్రత్యేక ప్రోటోకాల్ ఇస్తున్నారా? అంటూ పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఈ వివాదం ముదరడంతో తాజాగా శివాని ఒక వీడియో సందేశం ద్వారా అసలు విషయాన్ని వివరించారు.


తాను ఒక ప్రైవేట్ యూట్యూబ్ ఛానెల్ పాడ్‌కాస్ట్‌లో తన ఆథ్యాత్మిక అనుభవాల గురించి మాట్లాడిన మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారని శివాని తెలిపారు. "నేను నా ఆథ్యాత్మిక ప్రయాణం గురించి చెబుతూ కేదార్‌నాథ్, రామకోటి, తిరుపతి అనుభవాలను పంచుకున్నాను. 15 నిమిషాల దర్శనం అనేది ఇప్పుడు హైలైట్ అవుతోంది. కానీ నా ఉద్దేశం అది కాదు. క్యూ లైన్ లో ఉన్నప్పటి నుండి స్వామివారు మనకు కొంచెం కొంచెం కనిపిస్తూనే ఉంటారు. ఆ ప్రారంభం నుండి స్వామి వారి దగ్గరికి వెళ్లి వచ్చే వరకు పట్టిన మొత్తం సమయాన్ని నేను అందాజాగా 15 నిమిషాలు అని చెప్పాను. అంతేకానీ, 15 నిమిషాల పాటు స్వామి వారి గర్భాలయం ముందు నన్ను ఎవరూ టచ్ చేయకుండా నిలబెట్టారని కాదు" అని ఆమె వివరణ ఇచ్చారు.


సెలబ్రిటీ హోదాలో తనకు ఏదో ప్రత్యేక సదుపాయం కల్పించారన్న ఆరోపణలను కూడా ఆమె కొట్టిపారేశారు. "అక్టోబర్ 2025లో నేను, మా అమ్మ ఎయిర్‌పోర్టులోనే రూ. 10,500 శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు తీసుకున్నాము. సాధారణ భక్తురాలిగానే లైన్‌లో నిల్చుని దర్శనం చేసుకున్నాను. ఏవైనా తప్పుగా భావిస్తే క్షమించాలి" అంటూ శివాని తన వీడియోలో పేర్కొన్నారు.



More Telugu News