RJ Princee Pariikh: డేవిడ్ మిల్లర్‌తో వీడియో.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు రేప్ బెదిరింపులు!

RJ Princee Pariikh Receives Rape Threats After Video With David Miller
  • భారత్ ఓటమి తర్వాత ఫన్నీ వీడియోపై ఫ్యాన్స్ ఆగ్రహం
  • రేప్ బెదిరింపులు, బాడీ షేమింగ్‌తో ఫేస్‌బుక్ నుంచి వీడియో డిలీట్
  • వేధింపులకు పాల్పడిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్న ఆర్జే ప్రిన్సీ
టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓటమి తర్వాత ఆ జట్టు ఆటగాడు డేవిడ్ మిల్లర్‌తో సరదాగా వీడియో పోస్ట్ చేసిన ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌కు తీవ్ర వేధింపులు ఎదురయ్యాయి. ఆర్జే ప్రిన్సీ పారిఖ్ అనే ఆ యువతిపై కొందరు నెటిజన్లు దారుణంగా బాడీ షేమింగ్ చేయడమే కాకుండా, అత్యాచార బెదిరింపులకు సైతం పాల్పడ్డారు. ఈ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది.

భారత్ ఓటమిలో కీలకపాత్ర పోషించిన డేవిడ్ మిల్లర్‌తో ప్రిన్సీ సరదాగా ఓ వీడియో చిత్రీకరించి "మనం స్నేహితులం అనుకున్నా డేవిడ్" అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసింది. ఇది చూసిన కొందరు టీమిండియా అభిమానులు ఆమెపై విరుచుకుపడ్డారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ, అత్యాచార బెదిరింపులకు దిగారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రిన్సీ ఫేస్‌బుక్ నుంచి ఆ వీడియోను తొలగించారు. అయితే, ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం అలాగే ఉంది. తనపై వచ్చిన బెదిరింపులు, బాడీ షేమింగ్ కామెంట్లను భరించలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు స్పష్టం చేశారు.

  
అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన ఈ సూపర్-8 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 76 పరుగుల భారీ తేడాతో భారత్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా, డేవిడ్ మిల్లర్ (63) అద్భుత ఇన్నింగ్స్‌తో 187 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భారత జట్టు 111 పరుగులకే కుప్పకూలింది. ఈ ఓటమితో టీ20 ప్రపంచకప్‌లలో భారత్ 12 వరుస విజయాల జోరుకు బ్రేక్ పడింది. సెమీస్ చేరాలంటే తదుపరి మ్యాచ్‌లలో తప్పక గెలవాల్సిన పరిస్థితిలో టీమిండియా నిలిచింది.
RJ Princee Pariikh
David Miller
T20 World Cup
India vs South Africa
Rape threats
Social media influencer
Body shaming
Cricket
Ahmedabad

More Telugu News