విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి వేడుకలో ఫ్యామిలీ క్రికెట్ లీగ్

టాలీవుడ్ స్టార్ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ వేడుకలు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 26న వీరిద్దరూ ఏడడుగులు వేయనుండగా, ప్రీ-వెడ్డింగ్ వేడుకలు జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన ఓ ఫ్యామిలీ క్రికెట్ టోర్నమెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ వేడుకకు 'విరోష్ ప్రీమియర్ లీగ్' అని పేరు పెట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలను విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకున్నారు. ప్రత్యేకంగా తయారు చేయించిన జెండాలు, పతకాలు, జంట పేర్లు చెక్కిన మినీ క్రికెట్ బ్యాట్‌తో ఈ టోర్నమెంట్ సందడిగా జరిగింది. పెళ్లి వేడుకలకు వచ్చిన కుటుంబ సభ్యులు, అతిథులు ఈ మ్యాచ్ లలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఒక మెడల్ పై వీరి పెళ్లి తేదీ అయిన 26.02.26 అని ముద్రించి ఉండటం గమనార్హం. ఈ క్రికెట్ టోర్నమెంట్‌తో పాటు స్నేహితులతో కలిసి పూల్ వాలీబాల్, జపనీస్ తరహా డిన్నర్లు వంటి కార్యక్రమాలతో ఈ జంట పెళ్లికి ముందు ఆనందంగా గడుపుతోంది.

ఆదివారం నాడు, ఈ జంట తమ వివాహాన్ని అధికారికంగా ప్రకటించింది. తమకు అభిమానులు ప్రేమతో పెట్టిన 'విరోష్' అనే పేరునే తమ పెళ్లికి పెడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. "మా కలయికకు మీరిచ్చిన విరోష్ అనే పేరునే పెడుతున్నాం. మీ ప్రేమకు ధన్యవాదాలు" అంటూ వారు భావోద్వేగ పోస్ట్ పెట్టారు.

ఉదయ్‌పూర్‌లోని 'మెమెంటోస్ బై ఐటీసీ హోటల్స్' వేదికగా జరగనున్న ఈ వివాహ వేడుకకు కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరుకానున్నారు. అనంతరం స్నేహితులు, సినీ ప్రముఖుల కోసం రిసెప్షన్లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

Vijay Deverakonda
Rashmika Mandanna
Vijay Rashmika wedding
ViRosh wedding
Udaipur wedding
Tollywood wedding
Family cricket league
Indian celebrity wedding

More Telugu News