Thomas Sewell: భారత్‌పై విషం కక్కిన ఆస్ట్రేలియా అతివాది: మెల్బోర్న్ కోర్టు వెలుపల జాత్యహంకార విద్వేషం
- ఇండియాపై విద్వేషం చిమ్ముతున్న నయా నాజీ ఉద్యమకారుడు థామస్ సెవెల్
- భారత్ లాంటి మూడో ప్రపంచ దేశంగా ఆస్ట్రేలియా మారడం మాకు ఇష్టం లేదని వ్యాఖ్య
- భారత్ వల్ల ఆస్ట్రేలియా ఉనికి కోల్పోతుందన్న సెవెల్
ఆస్ట్రేలియాకు చెందిన నయా నాజీ ఉద్యమకారుడు, జాత్యహంకార సిద్ధాంతకర్త థామస్ సెవెల్ భారత్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెను దుమారం రేపుతున్నాయి. తనపై ఉన్న పలు క్రిమినల్ కేసుల విచారణ నిమిత్తం మెల్బోర్న్ కోర్టుకు హాజరైన అతడు, వెలుపల మీడియాతో మాట్లాడుతూ అత్యంత హేయమైన రీతిలో భారతీయులను, భారతీయ సంస్కృతిని అవమానించాడు. "భారత్ లాంటి మూడో ప్రపంచ దేశంగా ఆస్ట్రేలియా మారడం మాకు ఇష్టం లేదు" అంటూ అతడు చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయి.
'శ్వేత జాతీయుల స్థానభ్రంశం' పేరిట విద్వేష ప్రచారం చేసే 32 ఏళ్ల థామస్ సెవెల్... ప్రస్తుతం ఆస్ట్రేలియాలో రద్దయిన 'నేషనల్ సోషలిస్ట్ నెట్వర్క్' అనే అతివాద గ్రూపుకు నాయకత్వం వహించేవాడు. కోర్టు వెలుపల 7న్యూస్ రిపోర్టర్‌తో వాగ్వివాదానికి దిగిన అతడు, ఆస్ట్రేలియాలో శ్వేత జాతీయుల సంఖ్య తగ్గిపోతోందని, భారతీయ వలసదారుల వల్ల దేశం తన ఉనికిని కోల్పోతోందని ఆరోపించాడు. "మేము భారత్‌లా, సుడాన్లా మారకూడదు.. ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాగానే ఉండాలి" అంటూ విద్వేషపూరిత 'వైట్ రీప్లేస్మెంట్' సిద్ధాంతం గురించి మాట్లాడాడు. ఇదంతా ఒక కార్పొరేట్ కుట్ర అని, ఆస్ట్రేలియా మీడియా ఈ వాస్తవాలను దాచిపెడుతోందని అతడు రిపోర్టర్‌ను సైతం దూషించాడు.
థామస్ సెవెల్ పై 25 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2025 ఆగస్టులో మెల్బోర్న్లోని ఆదివాసీల పవిత్ర స్థలమైన 'క్యాంప్ సావర్నిటీ'పై తన అనుచరులతో కలిసి దాడి చేశాడన్న ఆరోపణలతో సహా మొత్తం 25 క్రిమినల్ కేసులను అతడు ఎదుర్కొంటున్నాడు. ఆ దాడిలో ఒక వ్యక్తిని పిడికిలితో కొట్టడం, మరొకరిని తన్నడం వంటి దుశ్చర్యలకు పాల్పడినట్లు కోర్టులో విచారణ జరుగుతోంది. అంతేకాకుండా, గతంలో మెల్బోర్న్ వీధుల్లో "తెల్లజాతి మనిషి తిరగబడాలి" అనే బ్యానర్లతో ప్రదర్శన చేస్తూ సామాన్యులపై దాడికి దిగిన చరిత్ర కూడా ఇతడికి ఉంది.
మరోవైపు, ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇటువంటి అతివాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని, జాత్యహంకారానికి తావులేకుండా చూడాలని భారతీయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.