అంబర్పేట్లో విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య
- ఉరి వేసుకుని భార్యాభర్త, మణికట్టు కోసుకుని కొడుకు బలవన్మరణం
- హోటల్ నిర్వహణలో నష్టాలతో అప్పులపాలైన యజమాని
- ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యలకు కారణమని పోలీసుల అనుమానం
రామరాజు స్థానికంగా హోటల్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా వ్యాపారంలో నష్టాలు రావడంతో రామరాజు అప్పుల పాలయ్యారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం రామరాజు ఇంటి తలుపులు తెరుచుకోకపోవడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. తలుపులు తెరిపించి చూడగా లోపల ముగ్గురూ విగతజీవులుగా కనిపించారు.
రామరాజు, మాధవి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకోగా, శశాంక్ తన మణికట్టు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల భారం పెరిగిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై కుటుంబమంతా ఈ విపరీత నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి ఆర్థిక లావాదేవీల కోణంలో విచారణ జరుపుతున్నారు.