రామ్ చరణ్‌పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే క్లారిటీ ఇచ్చిన అల్లు శిరీశ్

  • అల్లు శిరీశ్ పెళ్లి వేడుక సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో కనిపించిన రామ్ చరణ్
  • అయ్యప్ప మాలలో ఉండి పార్టీకి ఎలా వచ్చారంటూ ట్రోలింగ్
  • పార్టీకి ముందే చరణ్ వచ్చి... విష్ చేసి వెళ్లిపోయారన్న శిరీశ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటే కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, నిష్టతో కూడిన జీవనశైలికి ఆయన ఒక మారుపేరు. అయితే ఇటీవల అల్లు శిరీశ్ పెళ్లి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక పార్టీకి సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో, సోషల్ మీడియాలో చరణ్‌పై ఊహించని విమర్శలు వ్యక్తమయ్యాయి. అయ్యప్ప స్వామి మాలలో ఉండి పార్టీకి ఎలా హాజరవుతారంటూ కొందరు నెటిజన్లు నెగిటివ్ కామెంట్లతో విరుచుకుపడ్డారు. మాలను అవమానించారంటూ సాగిన ఈ ట్రోలింగ్‌పై తాజాగా అల్లు శిరీశ్ స్పందిస్తూ, విమర్శకుల నోళ్లు మూయించేలా అసలు విషయం వెల్లడించారు.


రామ్ చరణ్‌తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. ఆ రోజు అసలేం జరిగిందో శిరీశ్ వివరంగా చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఆ పార్టీ ఇంకా ప్రారంభం కాకముందే చరణ్ అక్కడికి చేరుకున్నారని, కేవలం విష్ చేయడానికి మాత్రమే ఆయన వచ్చారని క్లారిటీ ఇచ్చారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ మద్యం సేవించలేదని, చరణ్ కూడా అతిథిగా వచ్చి శుభాకాంక్షలు తెలిపి వెంటనే అక్కడి నుండి వెళ్లిపోయారని వివరించారు. అయ్యప్ప స్వామి అంటే చరణ్‌కు ఉన్న భక్తి శ్రద్ధలు వెలకట్టలేనివని, అటువంటి వ్యక్తి ఎప్పుడూ మతపరమైన ఆచారాలకు భంగం కలిగించరని అన్నారు.



More Telugu News