Jharkhand Air Ambulance Crash: ఝార్ఖండ్ లో కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్

Jharkhand Air Ambulance Crashes in Chatra All 7 Dead
  • ఝార్ఖండ్‌లో కుప్పకూలిన రెడ్‌బర్డ్ ఎయిర్‌వేస్ విమానం
  • రాంచీ నుంచి ఢిల్లీ వెళ్తుండగా చత్రా జిల్లాలో ఘటన
  • విమానంలో పైలట్లు, రోగి సహా ఏడుగురు ప్రయాణికులు
  • ప్రమాదంలో ఏడుగురూ మృతి చెందినట్లు అధికారులు వెల్లడి
ఝార్ఖండ్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఏడుగురు ప్రయాణికులతో రాంచీ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ అంబులెన్స్ చత్రా జిల్లాలో కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న ఏడుగురూ మరణించినట్లు అధికారులు తెలిపారు. 

వివరాల్లోకి వెళితే.. రెడ్‌బర్డ్ ఎయిర్‌వేస్‌కు చెందిన బీచ్‌క్రాఫ్ట్ C90 ఎయిర్ అంబులెన్స్ నిన్న రాత్రి 7:11 గంటలకు రాంచీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయింది. తీవ్ర గాయాలపాలైన సంజయ్ కుమార్ అనే రోగికి మెరుగైన చికిత్స అందించేందుకు ఢిల్లీకి తరలిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. టేకాఫ్ అయిన సుమారు 20 నిమిషాల తర్వాత, వాతావరణం అనుకూలంగా లేనందున మార్గాన్ని మళ్లించాలని పైలట్ కోరినట్లు, ఆ తర్వాత విమానంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయినట్లు అధికారులు తెలిపారు. 

ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు, రోగి, ఒక డాక్టర్,  పారామెడిక్, ఇద్దరు సహాయకులు సహా మొత్తం ఏడుగురూ మరణించినట్లు చత్రా డిప్యూటీ కమిషనర్ కీర్తిశ్రీ జి వెల్లడించారు. 

సమాచారం అందుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం, సహాయక బృందాలు చత్రా జిల్లాలోని సిమారియా అటవీ ప్రాంతంలోని ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. ఈ ఘటనను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ధ్రువీకరించింది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేసేందుకు ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) బృందాన్ని ఘటనాస్థలికి పంపింది. విచారణ పూర్తయితే ప్రమాదానికి అసలు కారణాలు తెలిసే అవకాశం ఉంది.
Jharkhand Air Ambulance Crash
Air ambulance crash
Jharkhand
Chatra district
Redbird Airway
Aircraft Accident Investigation Bureau
DGCA
Sanjay Kumar
Simaria forest

More Telugu News