భారత్ ఓటమిపై పగలబడి నవ్విన పాక్ మాజీ పేసర్.. ఇదిగో వీడియో!

టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ సెమీస్ చేరడం కష్టమేనని తాను చేసిన వ్యాఖ్యలు నిజమయ్యే సూచనలు కనిపించడంతో పాకిస్థాన్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ నవ్వు ఆపుకోలేకపోయాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమి అనంతరం ఒక టీవీ చర్చా కార్యక్రమంలో యాంకర్ తనను 'జ్యోతిష్కుడు' అని సంబోధించడంతో అమీర్ పగలబడి నవ్వాడు.

నిన్న‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టుపై దక్షిణాఫ్రికా 76 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఓటమితో భారత్ నెట్ రన్ రేట్ దెబ్బతినడమే కాకుండా సెమీ ఫైనల్ రేసు మరింత కఠినంగా మారింది.

ఈ కీలక మ్యాచ్‌కు ముందే భారత్ సెమీ ఫైనల్స్‌కు చేరదని, ఆ స్థానాల్లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ ఉంటాయని అమీర్ జోస్యం చెప్పాడు. ఈ వ్యాఖ్యలపై భారత అభిమానులు సోషల్ మీడియాలో అతడిని తీవ్రంగా ట్రోల్ చేశారు. అయితే, తాజాగా భారత్ ఓటమితో అతని అంచనా నిజమయ్యేలా కనిపిస్తుండటంతో పరిస్థితి మారింది.

మ్యాచ్ అనంతరం పాకిస్థాన్‌కు చెందిన ఓ టీవీ ఛానెల్‌లో జరిగిన చర్చలో యాంకర్ అమీర్‌ను పరిచయం చేస్తూ, "మన జట్టు చేయలేనిది, మన ప్యానలిస్టులు స్టూడియోలో కూర్చొని చేస్తున్నారు. అమీర్ మొదట అభిషేక్ శర్మను 'స్లాగర్' అన్నాడు. అప్పటి నుంచి అతను ఫామ్‌లో లేడు. ఇప్పుడు భారత్ సెమీస్ ఆడదని చెప్పాడు. అది కూడా నిజమయ్యేలా ఉంది. జ్యోతిష్కుడు, క్రికెటర్ అయిన అమీర్‌కు స్వాగతం" అని అన్నాడు. ఈ వ్యాఖ్యలు విన్న అమీర్ నవ్వుతూ, "నన్ను ఏమనుకుంటున్నారు? దేవుడా నన్ను క్షమించు (క్యా బనా దియా హై ముఝే? అల్లా మాఫ్ కరే)" అంటూ సరదాగా స్పందించాడు.

Mohammad Amir
India vs South Africa
T20 World Cup 2024
Pakistan cricket
cricket predictions
Indian cricket team
cricket analysis
Narendra Modi Stadium
Ahmedabad
Suryakumar Yadav

More Telugu News