Balka Suman: బాల్క సుమన్ నివాసంలో పోలీసుల సోదాలు..!

Police Raid at Balka Suman Residence in Mancherial
  • మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నివాసంలో పోలీసుల సోదాల కలకలం
  • ఇంట్లోకి వెళ్లి అన్ని గదులు తనిఖీ చేశారని ఆరోపణలు
  • సోదాలు జరపలేదని, నిందితుల కోసమే వెళ్లామని పోలీసుల వివరణ
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నివాసంలో పోలీసుల సోదాలు నిర్వహించారన్న వార్త మంచిర్యాల జిల్లాలో హాట్ టాపిక్ అయింది. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలోని ఆయన ఇంట్లో ఆదివారం పోలీసులు సోదాలు నిర్వహించారంటూ ప్రచారం జరిగింది. అయితే తాము ఎలాంటి సోదాలూ నిర్వహించలేదని పోలీసులు స్పష్టం చేయడంతో భిన్న కథనాలు వినిపిస్తున్నాయి.  

క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నికల సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్‌పై జరిగిన దాడి ఘటనలో బాల్క సుమన్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఇదే కేసులో నిందితుల కోసం ఆయన నివాసానికి పోలీసులు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. 

బాల్క సుమన్ ఇంటి ముందు ఆదివారం మాజీ కౌన్సిలర్ రేవెల్లి ఓదెలు, కంప్యూటర్ ఆపరేటర్ శ్రీనివాస్ మాట్లాడుకుంటుండగా.. రామకృష్ణాపూర్ (ఆర్కేపీ) ఎస్సై శ్రీధర్ మరో ముగ్గురు పోలీసులతో అక్కడికి చేరుకుని వాళ్లతో ఇంటి తాళాలు తీయించి లోపల అన్ని గదుల్లోనూ సోదాలు చేశారని సమాచారం. అనంతరం వారిద్దరి మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని, కాసేపటి తర్వాత తిరిగి ఇచ్చేసినట్లు తెలుస్తోంది. 

అయితే ఈ వార్తలను ఎస్ఐ శ్రీధర్ ఖండించారు. బాల్క సుమన్ ఇంట్లో ఎలాంటి సోదాలు జరపలేదని తెలిపారు. మంత్రి కాన్వాయ్‌పై దాడి కేసులో నిందితులుగా ఉన్న కొందరు అక్కడ ఉన్నారన్న సమాచారంతోనే తాము అక్కడికి వెళ్లామని, తనిఖీలు చేయలేదని ఆయన వివరణ ఇచ్చారు. 
Balka Suman
BRS
Telangana Politics
Mancherial
Kathanapalli
Vivek Venkataswamy
Police Raid
Minister Convoy Attack
Municipal Elections
Telangana News

More Telugu News