ఏపీలో భారత్‌నెట్ విస్తరణ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కీలక ఒప్పందం

Chandrababu Naidu Government Signs BharatNet Expansion Deal in Andhra Pradesh
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ సేవలను విస్తరించడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక ముందడుగు వేశాయి. అమెండెడ్ భారత్‌నెట్ ప్రాజెక్ట్ (ABP)ను రాష్ట్రంలో సమర్థంగా అమలు చేసేందుకు ఇరు ప్రభుత్వాల మధ్య ఒక ముఖ్యమైన సహకార ఒప్పందం (MoC) కుదిరింది. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. 

ఈ ప్రాజెక్టు కింద రాష్ట్రానికి రూ. 2,432 కోట్ల నిధులను కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సుమారు 5 లక్షల కుటుంబాలకు ఫైబర్ కనెక్షన్ల ద్వారా హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించడం. దీని అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ భారత్‌నెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (APBIL) పేరుతో ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ (SPV)ను ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను డిజిటల్ భారత్ నిధి, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా సమకూర్చనున్నాయి. 

కేంద్రం తరఫున డిజిటల్ భారత్ నిధి అడ్మినిస్ట్రేటర్ శ్యామల్ మిశ్రా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐ అండ్ ఐ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

ఈ ఒప్పందం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13,426 గ్రామ పంచాయతీల్లో నెట్‌వర్క్‌ను విస్తరించనున్నారు. ఇందులో భాగంగా, ఇప్పటికే ఫేజ్-I కింద ఉన్న 1,692 పంచాయతీల్లోని నెట్‌వర్క్‌ను ఆధునీకరిస్తారు. అలాగే, ఫేజ్-II కింద 11,254 గ్రామాల్లో డిజిటల్ కనెక్టివిటీ పనులను పూర్తి చేస్తారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 480 గ్రామ పంచాయతీలకు కూడా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నారు. 

వీటికి అదనంగా, స్థానిక అవసరాలు, డిమాండ్‌ను బట్టి 3,942 గ్రామాల్లో లాస్ట్ మైల్ కనెక్టివిటీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటారు. ప్రాజెక్టు సజావుగా సాగేందుకు అవసరమైన రైట్ ఆఫ్ వే అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పన, క్షేత్రస్థాయిలో సమన్వయం వంటి బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది.

గ్రామాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం ద్వారా డిజిటల్ గవర్నెన్స్, ఆన్‌లైన్ విద్య, టెలిమెడిసిన్, డిజిటల్ చెల్లింపులు, ఈ-గవర్నెన్స్ సేవలు మరింత పటిష్టంగా ప్రజలకు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఒప్పందం గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ విప్లవానికి బాటలు వేస్తుందని, సమ్మిళిత అభివృద్ధికి దోహదపడుతుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Andhra Pradesh
BharatNet Project
Digital India
Fiber Connectivity
Rural Internet
Jyotiraditya Scindia
Pemaasani Chandrasekhar
Digital Governance
AP Fiber Network

More Telugu News